దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఆ నేత రైతుల పక్షాన నిలబడ్డాడు. సందర్భమేదైనా రైతులకు మేలు జరిగేలా పోరాటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పసుపు పంటకు మద్దతు ధరపై నిలదీస్తాడు. ఎర్రజొన్న రైతులకు బాసటగా ఉంటాడు. మద్దుత ధర వచ్చే వరకు అమ్ముకోవద్దని తానున్నానని భరోసా నింపుతాడు. ఇవన్నీ చేసేది ఏ ప్రతిపక్ష పార్టీ నేతనో అనుకుంటే పొరపాటే. అతను అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన నేత. రైతు నేత. కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్‌ రెడ్డి. అదేంటీ.. ఇవన్నీ చేయాల్సింది బీఆరెస్‌ పార్టీ న నేతలు కదా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి రైతులకు బాసటగా నిలవాల్సింది వారే కదా.. అనంటారా..! బీఆరెస్‌ నేతలు ఎక్కడున్నారో..? వారి అధిష్టానం వారికేం ఆదేశాలిస్తుందో లేదో తెలియదు కానీ.. అన్వేష్‌ రెడ్డి మాత్రం రైతుల పక్షాన నిలబడి అధికారులను అప్రమత్తం చేస్తున్నాడు. మద్దతు ధర కోసం పోరాడుతున్నాడు. రైతులకు అండగా నిలుస్తున్నాడు.

ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన బీఆరెస్‌ చతికిలబడగా.. అధికార పార్టీ నేత మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండటం ఇక్కడ చర్చించుకోదగ్గ విషయం. అన్వేష్‌ రైతులకు ఆసరాగా నిలవడంతో అన్నదాతల మద్దతు లభిస్తున్నది. మొన్నటికి మొన్న పసుపు ధరల విషయంలో కలెక్టర్‌ను కలిసి విన్నవించాడు అన్వేష్‌. అర్వింద్‌ వైఖరిపైనా ఏకి పారేశాడు. బోర్డు అని మళ్లీ కొత్త పాట పాడుతున్న అర్వింద్‌..ఆనాడు బోర్డు లేదు గీర్డు లేదు.. అంబాసిడర్ కారొద్దంటూ ఏవేవో మాటలు చెప్పి రైతులను మోసం చేశాడని నిలదీశాడు. ఇవాళ పసుపుకు 12 వేల ధర రావడం అర్వింద్‌, కేంద్రం గొప్పతనం కాదని, పసుపు విస్తీర్ణం యాభైవేల ఎకరాల నుంచి 18వేల ఎకరాలకు పడిపోవడమేనన్నారు. దీనికి కారణం అర్వింద్‌ అబద్దపు హామీలు, రైతులను మోసంచేయడమనేని నిలదీయడం కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వస్తోంది. వాస్తవానికి ఈ పాత్ర పోషించాల్సింది బీఆరెస్. కానీ ఆ పార్టీ నాయకులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అన్వేష్‌ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు.

పసుపుకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో పలుమార్లు భేటీ అయ్యాడు అన్వేష్‌. తాజాగా ఎర్రజొన్న పంటపై తనదైన శైలిలో రైతుల పక్షాన పోరాటానికి పిలుపునిచ్చాడు ఈ రైతునేత. ఎర్రజొన్న చేతికొస్తున్న తరుణంలో మరోసారి వ్యాపారుల సిండికేట్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. మద్దతు ధర 4200 ఇవ్వాల్సింది పోయి.. ఎంతో కొంత ఇచ్చి చేయి దులుపుకునేందుకు సిండికేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాడు. వాస్తవానికి ఎర్రజొన్నల విషయంలో గత ప్రభుత్వం వ్యాపారులతో బై బ్యాక్‌ ఒప్పందాలు చేపించింది. ఇప్పుడు దాని ఊసు లేదు. దీనిపై బీఆరెస్‌ నేతలు రైతుల పక్షాన నిలిచిపోరాడాల్సిన సందర్భమిది. కానీ వారిలో చలనం లేదు. అన్వేష్‌ ఈ అంశాన్నీ ఓన్ చేసుకున్నాడు. రైతుల పక్షాన నిలిచాడు. ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇచ్చేంత వరకు రైతులెవరూ అమ్ముకోవద్దని కూడా ఆయన కోరుతున్నాడు.

You missed