దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజకీయానికి బడుగు నేత, పద్మశాలి కులానికి చెందిన బస్వా లక్ష్మీనర్సయ్య బలయ్యాడు. ఇన్నేళ్ల అతని రాజకీయ భవిష్యత్తును కాలరాశాడు అర్వింద్. దీనికి కారణం పార్టీలో అర్వింద్‌కు ఎదురుతిరగడమే. అసమ్మతిగా పనిచేయడమే. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించడమే. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మున్నూరుకాపుల తరువాత పెద్ద సంఖ్యలో ఉన్న కులం పద్మశాలి. టీఆరెస్‌లో తనకు టికెట్ దక్కలేదనే కోపంతో బీజేపీ పంచన చేరిన బస్వాకు ఇక్కడా అడగడుగునా ఆటంకాలు, అవమానాలే ఎదురయ్యాయి. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బస్వా తనకంటూ ఓ సొంత ఇమేజీ పెంచుకునే ప్రయత్నం చేశాడు.
ఇది అర్వింద్‌కు కొరుకుడు పడలేదు. సమయం కోసం చూశాడు. ఇలా కాలం అనుకూలంగా రాగానే కాటేశాడు. దీంతో బస్వాకు జిల్లా అద్యక్ష పదవి పోయింది. ఏ పదవీ దక్కలేదు. అలా వీఆరెస్‌లో పెట్టేశారన్నమాట. తనకు ఇంకా ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయని సస్వా మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం వీడటం లేదు. కానీ వాస్తవం ఏమిటంటే బీజేపీలో ఇప్పుడు బస్వా జీరో. అతను ఇన్ని రోజులు చేసిన సేవలు వృథా. అందులో అతను ఇక కొనసాగే పరిస్థితే లేదు. సీనియర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణను ఎటు కాకుండా చేసిన అర్వింద్.. ఇప్పుడు బస్వా రాజకీయ భవిష్యత్తును కాలరాశాడు.