దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

బీజేపీ సీనియర్‌ లీడర్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పల్లె గంగారెడ్డి అధిష్టానం తీరు, ఇక్కడ ఎంపీ అర్వింద్‌ వైఖరిపై గుర్రుగా ఉన్నాడు. కొద్ది రోజులుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎవరి ఫోన్లకు సకాలంలో స్పందించడం లేదు. చివరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్‌ కూడా. నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడుగా ఏడెనిమిదేండ్లు పనిచేసిన పల్లె గంగారెడ్డికి పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదనే అలక చాలా కాలంగా ఉంది. అదిప్పుడు బాహాటంగానే బయటపడుతున్నది. పార్లమెంటు ఎన్నికల వేళ తనకు మళ్లీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తానంటే నో చెప్పేశాడు. ఎంత బతిమాలినా వినలేదు. దీంతో దినేశ్‌ కులాచారి పేరు తెరపైకి వచ్చింది. కిసాన్‌ మోర్చా అధ్యక్షుడిగా కూడా అవకాశం ఇస్తామని బతిమాలారు. కానీ వినలేదు.

ఇంకా పార్టీ పదవులతో ఎంతకాలం నెట్టుకురావాలి..? ఇలా త్యాగాలు చేసుకుంటూ పోవాల్సిందేనా..? చట్ట సభలకు వెళ్లేందుకు చాన్స్‌ ఇవ్వలేదు. నామినేటెడ్‌ పదవులు కూడా రావా..? సెంట్రల్‌లో ప్రభుత్వం ఉన్నా.. మాలాంటి నేతలకు గుర్తింపు లేదా..? ఇదీ పల్లె గంగారెడ్డి నిర్వేదం. తొలత అర్వింద్‌ను నమ్మాడు. వెంట తిరిగాడు. కానీ అర్వింద్‌ తన అనుచరగణాన్ని పెంచి పోషించుకున్నాడే తప్ప సీనియర్లను పట్టించుకోలేదు. ఆర్మూర్‌ టికెట్‌ ఆశించాడు పల్లె. కానీ అది దక్కలేదు. నామినేటెడ్‌ పదవీ పైనా ఆశలు పోయాయి. ఇక ఎందుకు పార్టీలో ఇంతలా కష్టపడి పనిచేయాలి.. అనే వైరాగ్యం వచ్చేసింది.

దీంతో ఆయన పార్టీ నేతలతో, పార్టీ కార్యకలాపాలలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. కాగా జిల్లా అధ్యక్షుడిగా దినేశ్‌ కులాచారిని నియమిచింది అధిష్టానం. బస్వా లక్ష్మీనర్సయ్యను రాష్ట్ర పార్టీలో కూడా తీసుకోకపోవడం గమనార్హం. అర్వింద్‌ పూర్తిగా పార్టీని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడనేదానికి ఇదో తాజా ఉదాహరణ.

You missed