దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్. టెండర్లు పూర్తి చేసి .. అగ్రిమెంట్లు చేసుకుని .. ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకాల ఏర్పాటు చేసి పనులు ప్రారంభించేశారు. అవి కొనసాగుతున్నాయి కూడా. ఎన్నికలు ముగియగానే .. ఫలితాలు వెల్లడి కాగానే.. ఈ శిలాఫలకాలు నేలమట్టమయ్యాయి. ఎలా అంటారా..? కాంగ్రెస్ నుంచి గెలిచిన భూపతిరెడ్డి ఆదేశాలతో అనుచరులు చెలరేగిపోయారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ పనులు ప్రారంభమయ్యాయో.. శిలాఫలకాలు ఎక్కడెక్కడున్నాయో అన్నీ కూల్చేశారు. వాటికి ఇప్పుడు కొత్త రూపు వచ్చింది. కొత్త ప్రొటోకాల్ పుట్టుకొచ్చింది. పని అదే. అంచనా వ్యయం అంతే. అధికారులంతా వాళ్లే. కానీ ఒక్క ఎమ్మెల్యే మారాడు. బాజిరెడ్డి గోవర్దన్ స్థానంలో.. రేకుల భూపతిరెడ్డి పేరు వచ్చింది వాటిల్లో. వాటిని హడావుడిగా రెండ్రోజుల క్రితం ఏర్పాటు చేయించేశారు. ఇవాళ వీటికి మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తాడు కొత్త ఎమ్మెల్యే భూపతిరెడ్డి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కొత్త ఎమ్మెల్యే తతంగానికి ముక్కున వేసుకున్నారు. చెవులు కొరుక్కున్నారు. వాళ్లేం చేస్తారు పాపం.. ఎమ్మెల్యే కదా. ఇప్పటికే బిల్లులు రాక చచ్చే చావొచ్చి పడింది వారికి. ఈ పనులు చేయడమే తలకు మించిన భారంగా మారింది. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే కొత్త ప్రొటోకాల్ ఖర్చొకటి. నిండా మునిగినోడికి చలే లేదన్నట్టు.. పాపం కాంట్రాక్టర్లు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాజిరెడ్డి..
ఇదే విషయంపై రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు గురువారం ఫిర్యాదు చేశారు.తను వేసిన ఫౌండేషన్ స్టోన్లను వేశామని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే భూపతిరెడ్డి వీటికి మళ్లీ రీ లేయింగ్ చేస్తూ రూల్స్‌ను నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ కార్యక్రమాలను అభాసుపాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. వీటిని తక్షణమే ఆపాలని కోరారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు తెర తీసింది. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బాజిరెడ్డి ఈ ఇష్యూతో బయటకు వచ్చారు. ఇక రూరల్‌లో ఇద్దరి మధ్య రాజకీయ యుద్దం మొదలైనట్టేనని భావిస్తున్నారంతా. దీనిపై కలెక్టర్ ఎలా స్పందిస్తాడో మరి.