దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఇందూరు.. ఇప్పుడు మళ్లీ వార్తల్లో కేంద్రబిందువవుతోంది. నిజామాబాద్‌ ఎంపీ బరిలో ఎవరు నిలుస్తారనే చర్చ గత కొద్ది రోజులుగా ఉత్కంఠభరిత చర్చకు తెరతీసింది. రోజుకో సమీకరణల మధ్య అన్ని పార్టీల నేతలు, క్యాడర్‌ గందరగోళానికి, అయోమయానికి గురవుతున్నారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ కవిత బరిలో ఉంటారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. కవిత పోటీపైనే తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. కాగా బీఆరెస్‌ అధిష్టానం మారిన రాజకీయ పరిస్థితులకనుగుణంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీఆరెస్‌ అధిష్టానానికి ఇక్కడి నుంచి రెడ్డి సామాజికవర్గానికి టికెట్‌ కేటాయించాలనే డిమాండ్లు చేరిన నేపథ్యంలో ఇతర పార్టీల పరిస్థితి, అభ్యర్థుల ఎంపికపై బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ సీరియస్‌గా దృష్టి సారించారు.

బీజేపీ బరి నుంచి అర్వింద్‌కే అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్నా… అతనిపై నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ రావడంతో గెలుపు అంత ఈజీ కాదనే అంచనాలో వారున్నారు. అర్వింద్‌కు సొంత పార్టీలోనే అసమ్మతి కుంపటి, వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నాయి. దీంతో తమకు పోటీ కాంగ్రెస్‌ పార్టీయేనని బీఆరెస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి ఎవరికి టికెట్‌ ఇస్తారనే సమీకరణలో ప్రధానంగా వెలుగులోకి వచ్చిన పేరు జీవన్‌రెడ్డి. జగిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే బీఆరెస్‌ కూడా అందుకు తగ్గ బలమైన రెడ్డి సామాజిక వర్గానికివర్గాల్లో చెందిన ప్రత్యర్థినే నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమీకరణలోనే ప్రముఖ వ్యాపారవేత్త, విజయ్‌ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలల అధినేత కాటిపల్లి నరేందర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

నరేందర్‌ రెడ్డి కేసీఆర్‌కు సుపరిచితుడు. పార్టీ లీడర్‌. టీఆరెస్‌ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నవాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్మూర్‌ నుంచి అధిష్టానం నరేందర్‌రెడ్డి పేరు పరిశీలించింది. నరేందర్‌రెడ్డి గతంలో ముధోల్‌ నుంచి పోటీ చేసేందుకు టీఆరెస్‌ టికెట్‌ ఆశించినా .. రాజకీయ సమీకరణల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన పేరు తెరపైకి వచ్చింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సుపరిచితుడు, ప్రభావశీలియైన నరేందర్‌రెడ్డిని ఎంపీ బరిలో దించితే ఎలా ఉంటుందనే చర్చ బీఆరెస్‌ అధిష్టానం వద్ద వచ్చినట్టు తెలిసింది. బీఆరెస్‌ ముఖ్యనేతలు కూడా ఈ విషయాన్ని ఖండించడం లేదు. మొత్తానికి ఈ కొత్త సమీకరణ ఇటు బీఆరెస్‌ సర్కిళ్లలోనే కాదు.. కాంగ్రెస్‌, బీజేపీలో కూడా చర్చనీయాంశం కాబోతున్నది.