దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
ఆర్మూర్ రచ్చ రాజకీయం రాష్ట్ర వ్యాప్తం చర్చై కూర్చుంది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పరిణామాలు ఒక్కసారిగా మారాయి. తన ప్రచారంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని మాటలతో టార్గెట్ చేసిన రాకేశ్.. గెలిచిన తరువాత మళ్లీ అదే దూకుడును కొనసాగించడంతో ఇద్దరి మధ్య వైరం మరింత రాజుకుంది. ఓ టీవీ ఛానల్ వేదికగా ఇటీవల ఇద్దరు ఒకరికి మించి ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడం మరింత రచ్చకు కారణమైంది. ఈ ఇద్దరి వాదులాటలు, రచ్చ రాజకీయాలు ఇలా ఉంటే.. మధ్యలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలైన పొద్దుటూరి వినయ్‌రెడ్డి అక్కడ షాడో ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నాడు.
అధికారులు, పోలీసులు అందరూ తను చెప్పినట్టే వినాలని, తనకు తెలియకుండా ఏమీ చేయొద్దని, ఎమ్మెల్యే చెప్పినవన్నీ చేయొద్దని అల్టిమేటం జారీ చేశాడు. ఇది కొత్త వివాదానికి తెరతీసింది. వినయ్‌రెడ్డి వ్యవహార శైలిపై బహిరంగ వేదికలపైనే ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఎండగడుతూ వస్తున్నాడు. తాజాగా ఈ విషయంపై బుధవారం జిల్లాకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు చెప్పి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు రాకేశ్‌రెడ్డి. మాక్లూర్ మండలం ఆంధ్రనగర్‌లో ఓ కార్యక్రమానికి మంత్రితో పాటు మండవ వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తరువాత తిరుగుపయనంలో వినయ్‌రెడ్డి ఆర్మూర్‌లో అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నాడని, కంట్రోల్‌లో పెట్టుకోకపోతే చూసుకుందాం..! అని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై మంత్రి, మండవ ఇద్దరూ స్పందించినట్టు సమాచారం. సీఎం రేవంత్ వద్దకు ఈ పంచాయతీ వెళ్లిందని, మరోసారి మాట్లాడుతానని మంత్రి చెప్పినట్టు తెలిసింది.