దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
ఇందూరు కాంగ్రెస్‌లో చాలా ఏళ్ల తరువాత కొత్త జోష్ వచ్చింది. సీనియర్ నేత డీఎస్ జమానాలో చాలా ఏళ్లు కాంగ్రెస్ హవా నడిచింది. బీసీ నేతగా డీఎస్.. ఏఐసీసీ వర్గాలతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. అంతా తానై నడిపించారు. ఇందూరు నుంచి ఎదిగిన బీసీ నేతగా డీఎస్ ఉమ్మడి ఏపీలో.. ఢిల్లీలో తన పరపతి చాటుకున్నాడు. ఆ తరువాత కాంగ్రెస్‌కు కష్టకాలమే వచ్చింది. డీఎస్‌కు రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకులు.. అనారోగ్య సమస్యలతో ఆయన చరిష్మా తగ్గిపోయింది. ఇప్పుడు అదే రేంజ్‌లో మరో బీసీ నేత ఇందూరు నుంచి ఎదిగి వచ్చాడు. ఆయనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చుడు పక్కా అయిపోయింది.
ఇందూరు కాంగ్రెస్‌కు మంచికాలం వచ్చిందని, అరుదైన గౌరవం దక్కిందని ఖుషీ అవుతున్న నేతలకు మరో తీపి కబురు వచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూడా మహేశ్‌కు వరించింది. చివరి నిమిషంలో ఆయన పేరు జాబితాలో వచ్చి చేరింది. దీంతో మహేశ్‌కు రాజకీయంగా బంపర్ ఆఫర్ దక్కింది. ఇటు చట్టసభల్లో తన ప్రాతినిథ్యం దక్కడంతో పాటు.. అటు కీలకమైన పార్టీ స్టీరింగ్ బాధ్యతలు తనకు అప్పగించి సమన్వయ పరిచే బాధ్యతను కూడా ఏఐసీసీ పెద్దలు ఆయనకు అప్పగించడం.. మహేశ్ పార్టీ పట్ల చూపుతున్న విధేయతకు, అకుంఠిత దీక్ష,ఓపికకు దక్కిన గౌరవప్రదమైన ఫలితం. నిజామాబాద్ అర్బన్ నుంచి మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డాడు మహేశ్.
అధిష్టానం చెప్పినట్టే నడుచుకున్నాడు. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ మాట జవదాటలేదు. ఏఐసీసీ పెద్లల సూచనను ఎప్పుడూ ఉల్లంఘించలేదు. అందుకే ఆయన పార్టీ పట్ల చూపిన విధేయతకు పట్టం గట్టింది ఏఐసీసీ. ఇప్పుడు ఇందూరు కాంగ్రెస్‌లో నయా జోష్ వచ్చింది. డీఎస్ తర్వాత ఆ స్థాయిలో కాంగ్రెస్‌లో ఎదిగిన బీసీ నేతగా మహేశ్‌కుమార్ తన నూతన రాజకీయశకాన్ని ప్రారంభించనున్నారు.