దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

ఇందూరుకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. బీసీ నేతగా అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడి విధేయతకు ఏఐసీసీ ఆశీస్సులు లభించడంతో కీలక పదవి దక్కింది. సీనియర్ నేత డీఎస్‌ తరువాత ఇందూరు కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు పీసీసీ ప్రెసిడెంట్‌గా అవకాశం దక్కడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో ఏఐసీసీ వద్ద జరిగిన కసరత్తులో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు కూడా ఎమ్మెల్సీ వస్తుందని చివరి వరకు ప్రచారం జరిగింది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి సమీకరణలో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేరు చివరలో తప్పించారు. ఇక్కడా ఆయన త్యాగం చేయక తప్పలేదు.

ఇటు ఎమ్మెల్సీతో పాటు పీసీసీ ప్రెసిడెంట్‌గా మహేశ్‌ పేరు వినవచ్చింది. జోడు పదవులు దక్కుతాయని అంతా భావించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో తమ సీటును త్యాగం చేసిన వారికి ప్రాధన్యం ఇచ్చిన రేవంత్‌ అందులో భాగంగా అద్దంకి దయాకర్‌, బల్మూర్‌ వెంకట్‌లకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి టికెట్‌ ఆశించాడు. కానీ రాజకీయ సమీకరణలో భాగంగా షబ్బీర్‌ అలీ కోసం త్యాగం చేయకతప్పలేదు. ఇవన్నీ పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తరువాత పీసీసీ ప్రెసిడెంట్‌గా మహేశ్‌ కుమార్‌ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇది దాదాపు ఫైనల్ అయ్యింది. ఇప్పటికే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహేశ్‌కుమార్‌ పార్టీ పెద్దలతో సమన్వయం చేసుకుంటు సీఎం రేవంత్‌ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా సక్సెసవుతున్నాడు.

ఈ క్రమంలోనే అతనికే పీసీసీ చీఫ్‌ ఇస్తే ..ఇటు పార్టీ, అటు ప్రభుత్వం సమన్వయం చేసుకుని ముందుకు సాగుతాయనే భావనలో ఏఐసీసీ ఉంది. బీసీకే ఈసారి పీసీసీ ఇద్దామని అనుకుంటున్న క్రమంలో మహేశ్‌కు ఇది కలిసివచ్చింది. దీనికి తోడు పార్టీ పట్ల విధేయత, ఓపిక, పార్టీ గెలుపు కోసం చేసిన త్యాగం.. ఇవన్నీ ఏఐసీసీ గుర్తించింది. మొత్తానికి డీఎస్‌ తర్వాత మళ్లీ ఇందూరు కాంగ్రెస్‌లో కీలక పదవిని దక్కించుకున్నాడు ఈ బీసీ నేత.

You missed