దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌లో పదవుల పండుగకు తెరలేసింది. సంక్రాంతి తరువాత కార్పొరేషన్ పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్దమయ్యింది. సీనియర్లకు, పార్టీ విధేయులకు ప్రధమ ప్రాధన్యతనిచ్చే విధంగా జాబితా రెడీ అవుతుంది. మరో రెండు మూడు రోజుల్లో ఇది ఫైనల్ కానున్నట్టు తెలుస్తోంది. బీఆరెస్ ప్రభుత్వం హయాంలో కార్పొరేషన్ పదవులు చాలా మటుకు ఖాళీగా ఉంచేశారు. మార్కెట్‌కమిటీలను కూడా నియమించలేదు. ఇది ఆ పార్టీ సీనియర్లలో, ఉద్యమ నాయకుల్లో తీవ్ర నైరాశ్యం నింపింది. ఇలాంటి పరిస్థితి తమ పార్టీలో చోటుచేసుకుకుండా వెంటనే నామినేటెడ్ పదవులను నింపితే నాయకులు ఉత్సాహంగా పనిచేస్తారని అధిష్టానం భావిస్తోంది.
పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుకు ఇది కీలకనాంది కానుందని కూడా భావిస్తున్నారు. జిల్లా నుంచి కార్పొరేషన్ పదవులు ఆశించే వారి లిస్టు చాంతాడంత తయారయ్యింది. ఈ మధ్య ఓ మీడియాలో సీఎం రేవంత్.. పార్టీ టికెట్ త్యాగం చేసిన వారికి మొదట ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో వారంతా ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారు. కాగా ఇందూరు నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ రేసులో ఉండగా.. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కేబినెట్‌లోకి తీసుకుని హోం మినిస్టర్ శాఖను అప్పగిస్తారని అనుకుంటున్నారు.
వీరితో పాటు ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, అంతరెడ్డి రాజారెడ్డి, అరికెల నర్సారెడ్డి, కాట్‌పల్లి నగేశ్‌రెడ్డి, ఆకుల లలిత, ధర్మపురి సంజయ్, నరాల రత్నాకర్, తాహెర్‌బిన్ హందాన్, షబ్బీర్‌అలీ.. ఇలా లిస్టు పెద్దగానే ఉంది. పదవులు అందరికీ వరించకున్నా.. జిల్లాలో కీలక పదువులు మాత్రం ఇక్కడి నేతలకు ఇచ్చే అవకాశం ఉంది. ఎలాగైనా నిజామాబాద్ పార్లమెంటు సీటును గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్న అధిష్టాన వర్గం పదవుల పంపిణీలో జిల్లాకు అగ్రతాంబూలం ఇవ్వనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.