దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

నిజామాబాద్‌ బీఆరెస్‌ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన పార్టీ.. మళ్లీ పూర్వవైభవం కోసం తహతహలాడుతోంది. పార్టీకి ఇంతటి నష్టాన్ని చేకూర్చిన వైనాన్ని కళ్లారా చూసినా ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్న ఉద్యమకారులు, సీనియర్‌ లీడర్లు తెగించి ముందుకొచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టారు. కవితే మళ్లీ ఎంపీగా ఇక్కడ్నుంచి పోటీ చేయాలని.. ఆమె వస్తే ఓడిన చోటే గెలిపించి తీరుతామని శపథం చేస్తున్నారు.

అర్వింద్‌ ఎంపీగా విఫలయ్యాడని చెబుతూనే ఆమె రాక ఇందూరు బీఆరెస్‌ పార్టీకి ఎంతటి అనివార్యతో వారి మాటల్లో ప్రస్పుటమయ్యింది. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ మినహా మిగితా చోట్ల పార్టీ ఘోర పరాభవం పాలయ్యింది. పార్టీని సిట్టంగులు పూర్తిగా భ్రష్టు పట్టించారనేది సీనియర్ల అభిప్రాయం. ఆ మాటకొస్తే కవిత కూడా ఇక్కడ జరిగిన పార్టీ విధ్వంసమంతా తెలుసు.అందుకే ఆమె మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహాక సమావేశంలో కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఓడిన ఎమ్మెల్యేలతో ఆమె ముందుకు సాగలేదని తెలుసు. వారిని వెంటబెట్టుకుని గెలవడమూ కష్టమని తెలుసు. మరి ఎందుకు ఇంతటి ధైర్యం చేసింది…? వీరిని కాదని ఎలా గెలవగలుగుతుంది..? ఈ ప్రశ్నలకు సమాధానంగానే ఇవాళ పార్టీ సీనియర్ల, ఉద్యమకారుల ప్రెస్‌మీట్‌. ఓ రకంగా పరోక్షంగా వారు కవిత గెలుపు కోసం మేమున్నాం.. సైన్యంలా పనిచేస్తాం.. ఓటమి చెందిన నేతలను నమ్ముకోవడం వృధా అనే విధంగా తమ మాటల ద్వారా సంకేతాలిచ్చారు. ఉద్యమ నేతగా కవితకు జిల్లాలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడున్న ఎంపీపై ప్రజల్లో వ్యతిరేకతా ఉంది. మరోవైపు ఓడిన సింపతీ ఆమెకు ఉండనే ఉంది.

ఇవన్నీ కలిసి ఆమె ఎంపీగా గెలవడం కష్టమేమీ కాదనే భావనలో పార్టీ శ్రేణులు, పార్టీ శ్రేయోభిలాషులున్నారు. జిల్లాలో కంచుకోటలా ఉన్న పార్టీకి బీటలు వార్చింది సిట్టింగులేనని బలంగా ఆ పార్టీ ముఖ్య నేతలే నమ్ముకున్న కారణంగా.. కవితే ఇప్పుడు జిల్లా పార్టీని తన కనుసన్నల్లో నడపగలగాలి. పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పనిచేసిన ప్రతీ ఒక్కరినీ చేరదీయాలి. పదవులిప్పించుకోవాలి.ఏ ఆపద వచ్చినా ఆదుకోవాలి. నేనున్నానంటూ అందుబాటులో ఉండాలి. ఆమె చుట్టూ ఉన్న కోటరీని కూల్చేయాలి. ఇనవ్నీ జరగాలని వీరంతా కోరుకుంటున్నారు. ఆమె గెలిపించుకునేందుకు ఎంతటి శ్రమకైనా ఓరుస్తాం.. పార్టీని కాపాడుకుంటామనే వారి ఉద్యమపిలుపులు ఇప్పుడు కవిత ఆయువు పట్టుగా మారుతున్నాయి.

 

You missed