దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
ఒకప్పుడు వీరంతా మిత్రులు. కలిసి పనిచేశారు. కలిసి బిజినెస్‌లూ చేశారు. షబ్బీర్ అలీ, అతని తమ్ముడు నయీం, నర్సింగరావు కలిసి వ్యాపార రాజ్యాలేలారు. కామారెడ్డిలో వారు చెప్పిందే వేదం. అధికారం చేతిలో ఉండగా.. లేనప్పుడు.. ఎప్పుడైనా వారిదే నడిచింది హవా. ఇప్పుడు నర్సింగరావు టీఆరెస్‌లో ఉన్నాడు. మొన్న కాంగ్రెస్ నుంచి కామారెడ్డి బరిలో పోటీలో నిలిచి తప్పుకుండా గెలుస్తానని కలలు కన్న షబ్బీర్‌కు .. కేసీఆర్ రూపంలో షాక్ తగిలింది. ఇక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నాడనగానే సగం చచ్చినంత పనైంది. దీనికి తోడు నర్సింగరావు తన మాచారెడ్డి మండలంలో తన పరపతి, హవా ఉపయోగించి ఏకగ్రీవాల జోరు నడిపించాడు. దీనికి జడుచుకున్నాడు షబ్బీర్. ఇక తన ఓటమి తథ్యమనుకున్నాడు. అధిష్టానాన్ని బతిమాలుకొని నిజామబాబాద్ అర్బన్‌కు షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇక్కడా పరాజయమే పొందాడు. కానీ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చింది. దీంతో షబ్బీర్ రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యాడు.
ఒకవేళ కామారెడ్డి నుంచి పోటీ చేసినా తను గెలిచేవాడనని, ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కావాల్సిన వాడినని ఎంతో బాధపడుతున్నాడు. మనోవేదనకు గురవుతున్నాడు. ఇప్పుడు కనీసం మంత్రి పదవి కూడా ఇచ్చేలా లేదు అధిష్టానం. ఇవన్నీ తలుచుకున్నప్పడు దీనంతటికీ కారణమెవరా అని కడుపు మసిలిపోతున్న సమయంలో ఆయనకు మొదట తట్టిన పేరు నర్సంగరావు. ఏకగ్రీవాల పేరుతో తనను హడలెత్తించి కామారెడ్డి నుంచి పారిపోయేలా చేసిన నర్సింగరావుపై ప్రతీకార దాడి మొదలుపెట్టాడు షబ్బీర్… అతని తమ్ముడు నయీం. పల్వాంచలోని నర్సింగరావుకు చెందిన క్రషన్లు, ప్లాంట్లు మూత పడేలా చక్రం తిప్పాడు షబ్బీర్. అధికారులంతా ఇప్పుడు షబ్బీర్ చేతుల్లోనే. అంతే ఇక ఆట మొదలుపెట్టాడు. ఇస్తే వాటా ఇయ్యు లేదా దాడులే అనే రీతిలో వార్నింగ్ ఇచ్చాడు. అక్కడ నుంచి బదులు లేదు. దీంతో దాడులు మొదలయ్యాయి. ఒకప్పుడు ఇలా కలిసి వ్యాపారాలు చేసుకున్న ఈ మిత్రబృందం ఇప్పుడు బద్ద శత్రువులయ్యారు. అధికారం అడ్డు పెట్టుకుని దాడులు తెగబడ్డారు. ప్రస్తుతం కామారెడ్డిలో ఈ వార్ పతాకస్థాయికి చేరి రచ్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో చర్చకు తెరతీసింది.