దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ ఎంపీగా బరిలో నిలవడం ఫైనల్ అయ్యింది. ఇప్పటికే ఆమె గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నారు. తనకంటూ ఓ సొంత టీమ్‌ను రంగంలోకి దింపారు. తన కోసం సోషల్‌ మీడియా టీమ్‌ కూడా యాక్టివ్‌ అయ్యింది. గత కొద్ది రోజులుగా వాట్సాప్‌ గ్రూపులలో, ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియా మాధ్యమాల్లో కవితకు అనుకూలంగా, నిజామబాద్‌ ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు చర్చకు తెర తీశాయి. ఎంపీగా కవిత ఉన్న సమయంలో ఏమేమీ చేశారు..? అర్వింద్‌ ఏమీ చేయలేకపోయాడనే విధంగా గణాంకాలు, సోదాహరణలో సహా ఇద్దరి మధ్య తేడాలను పోల్చి చూపుతూ తయారు చేసిన పోస్టర్లను సోషల్‌ మీడియాలో వదులుతున్నారు కవిత టీమ్‌. దీంతో ఆమే ఇక్కడ నిజామాబాద్‌ ఎంపీ బరి నుంచి పోటీలో ఉంటుందనేది తేటతెల్లమయ్యింది.

మొన్న పార్లమెంటు నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో ఆమె సిట్టింగు ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆరెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. లోపాలను కడిగిపారేశారు. వారి వైఖరి వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగిందో ఖుల్లం ఖుల్లా మాట్లాడేశారు. ఇది తీవ్ర చర్చకు తెర తీసింది. కేటీఆర్‌ పార్టీ పదవులు భర్తీ చేయకపోవడం, కమిటీలు వేయకపోవడం, కార్పొరేషన్‌ పదవులు నింపకపోవడం వల్ల కూడా లీడర్లు తీవ్ర నిరాశకు లోనయిన విషయాన్ని తవ్వి తీశారు. దీంతో ఇప్పటికైనా మార్సు వస్తుందనే భావనలో ఉన్నారు బీఆరెస్‌ కింది స్థాయి క్యాడర్‌, లీడర్‌ షిప్‌. ఇక్కడి నుంచి కవిత తప్ప వేరొకరు నిలబడితే గెలవడం కష్టమనే సంకేతాలు పార్టీ అధిష్టానానికి ఉన్నాయి. ఒకసారి ఓడిన కవితకు సానుభూతి తోడవుతుందని భావిస్తున్నారు.

దీంతో పాటు ఇప్పుడు ఓడిన ఎమ్మెల్యేలను ఆమె నమ్మడం లేదు. తనకంటూ ఓ సొంత సైన్యమే ఏర్పాటు చేసుకుంటున్నది. ఇప్పటికే టీమ్‌లు రంగంలోకి దిగాయి. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు స్థానాలు బాల్కొండ, జగిత్యాల, కోరుట్లలో బీఆరెస్‌ అభ్యర్థులు గెలిచారు. బోధన్‌, అర్బన్‌ నియోజకవర్గాల్లో కవిత ప్రభావం ఉంటుంది. రూరల్‌ లో కూడా పార్టీకి పట్టు పూర్తిగా పోలేదు. ఆర్మూర్‌లోనే కొంచెం కష్టం. దీంతో ఎలాగైనా తను ఎంపీగా గెలుస్తాననే ధీమా కవితలో కనిపిస్తున్నది.

You missed