దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్ ఎప్పుడూ వివాదంలో నానుతూ ఉంటుంది. మొన్నటి వరకు ఆర్టీసీ జాగాలో లీజుకు తీసుకుని ఆ మొత్తాన్ని ఇంకా కట్టలేదని కొత్తగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ రంగంలోకి దిగక తప్పలేదు. మొత్తం 8.50 కోట్ల బకాయిల్లో జీవన్‌రెడ్డి 2.50 కోట్లు చెల్లించాడు. మిగిలిన వాటికి సమయం అడిగాడు. కానీ ఆలోగా మళ్లీ కొత్త పంచాయతీ తెరమీదకు వచ్చింది. ఆ పైకాన్ని ఆర్టీసీ అప్పనంగా తన సొంత ఖర్చులకు వాడుకుంటుందని, అది మా సొమ్మంటూ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిశాడు.
ఆ పైసలు మావి మాకు ఇప్పించండి.. మేం వాటితో కొత్త బస్టాండ్ నిర్మించుకుంటాం. కమర్శియల్ షాపులు కట్టుకుని కిరాయికి ఇచ్చుకుంటాం… ఆదాయం వస్తుంది అని ప్రశ్నించడంతో ఎండీ నాలుక్కర్చుకున్నాడు. ఇదెక్కడి లొల్లిరా నాయ్నా అని నెత్తి పట్టుకున్నాడు. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు కిమ్మనని ఆర్టీసీ అధికారులు.. మేం నిలదీస్తే, ప్రశ్నిస్తే ఒత్తడి తెస్తే బకాయిలు వసూలు చేస్తున్నారని మరింత కాలం ఏం చేశారని ప్రశ్నించాడు పైడి. మా నిధులను మాకే ఇవ్వాలని… వాటి జోలికి రావొద్దని ఎండీకి అల్టిమేటం ఇచ్చాడు పైడి రాకేశ్‌రెడ్డి. ప్రస్తుతం ఇది ఆర్టీసీ వర్గాల్లోనే కాదు జిల్లా రాజకీయాల్లోనూ చర్చై కూర్చుకున్నది.