దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన రాజకీయ జీవితానికి ఇక రిటైర్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటున్నాడు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు భాస్కర్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకుని ఎమ్మెల్యేగా చూడాలని కలలు కన్నాడు. కానీ కేసీఆర్‌ ఒప్పుకోలేదు. రిస్క్‌ తీసుకోదలుచుకోలేదని ఖరాకండిగా చెప్పేశాడు. దీంతో పోచారమే మళ్లీ బరిలోకి దిగాల్సి వచ్చింది. కేసీఆర్‌ పెట్టుకున్న అంచనాల మేరకు శ్రీనివాస్‌రెడ్డి గెలిచి చూపించాడు.

కానీ ఎక్కడో వెలితి వెంటాడుతోంది. ఎలాగైనా తను ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉన్నప్పుడే కొడుకు పోచారం భాస్కర్‌ రెడ్డిని రాజకీయంగా సెట్‌ చేయాలనే బాధ వెంటాడుతోంది. ఇప్పటికే ఆయన కేసీఆర్‌ చలువతో డీసీసీబీ చైర్మన్‌ ను చేయించుకోగలిగాడు. ఇది రాజకీయంగా చట్టసభల్లో అడుగుపెట్టేందుకు ఓ కీలకమెట్టుగా ఉపయోగపడే ఓ అస్త్రమనే ఆయన భావించాడు. కానీ పెద్దాయన చేసిన ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. వీటినీ వదలేదు పోచారం. ఇదీ ఓ మంచి అవకాశంగానే భావిస్తున్నాడు. బీబీ పాటిల్‌పై చాలా వ్యతిరేకత తోడైంది. గతంలో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచాడు.

కానీ పాటిల్‌ పట్ల ఎవరికీ సదాభిప్రాయం లేదు. ఇష్టమూ లేదు. ఈ తరుణంలో ఇదే మంచి అవకాశంగా పోచారం భావించాడు. తన మనసులోని మాట చెప్పేందుకు ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహాక సమావేశం వేదికగా పరోక్షంగా అధిష్టానానికి తన అభీష్టాన్ని వినిపించాడాయన.