అసెంబ్లీకి రాం రాం..

ఎంపీగా పోటీకే కేసీఆర్‌ మొగ్గు..

ఎన్నికల ఫలితాలు గులాబీ నేతను కుంగదీసిన వైనం…

‘రేవంత్‌ అసెంబ్లీ’లో అడుగు పెట్టడం ఇష్టంలేక… ప్రజాతీర్పు నచ్చక..

పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికీ ఇష్టపడని కేసీఆర్‌.. మొత్తం కేటీయార్‌కే బాధ్యతలు..

మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసి.. ఢిల్లీకే పరిమితమయ్యేందుకు నిర్ణయం..?

  • వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌
  • దండుగుల శ్రీనివాస్‌- నిజామాబాద్‌:

కేసీఆర్‌ అసెంబ్లీ కి రాం రాం చెప్పబోతున్నాడు. ప్రజాతీర్పు ఆయనను కుంగదీసింది. ఎలాగైన తనే మరోసారి సీఎం కావాలనుకున్నాడు. అవుతానని ఘాట్టిగా నమ్మాడు. కానీ ప్రజలు తిరస్కరించారు. విసిగి వేసారి పోయిన ప్రజలకు మళ్లీ సిట్టింగులనే వదలడంతో జీర్ణించుకోలేకపోయారు. తిప్పికొట్టారు. ప్రభుత్వాన్ని కూలదీశారు. ఈ పరిణామం కనీసం కేసీఆర్‌ కలలో కూడా ఊహించలేదు. ఇది చాలదంటూ కాలుజారి కింద పడటం ఆరోగ్యం మరింత క్షీణించడం.. దెబ్బ దెబ్బ. మానసికంగా, శారీరకంగా. మొత్తానికి కేసీఆర్‌ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇక తాను అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని. రేవంత్‌ రెడ్డి లాంటి సీఎం ఉన్న అసెంబ్లీలో తాను వెళ్లి కూర్చోవడమా..? ఇది కేసీఆర్‌కు సుతారామూ ఇష్టంలేదు. ఆయన మనస్తత్వం అలాంటిది మరి. కేసీఆర్‌ మారలేదు. మారడు. అందుకే పార్లమెంటుకే పరిమితమవుదామనుకుంటున్నాడు. మెదక్‌ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఢిల్లీలో కాలక్షేపం చేద్దామనుకుంటున్నాడు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే కుండబద్దలు కొట్టినట్టు ఇదే విషయాన్ని చెప్పాడు కూడా. ‘ ఓడిపోతే నాకు పోయేదేం లేదు. నష్టమేమీ లేదు. పోయి ఫాం హౌజ్లో పడుకుంటా..! మీకే నష్టం..!’ అని డైరెక్టుగానే ఓటర్లను బెదిరించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ జనాలు బెదరలేదు. అప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు. ఓడగొట్టారు. ఫామ్‌ హౌజ్‌కే పరిమితం చేశారు. త్వరలో ముంచుకొస్తున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా తన ముఖం చూపాలనుకోవడం లేదు కేసీఆర్‌. అంతా కేటీఆర్‌కే బాధ్యతలు అప్పగించాడు. వచ్చే నెల 3 నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ , గెలుపుపై తెలంగాణ భవన్‌లో సమావేశాలున్నాయి. ఇవన్నీ కేటీయారే చూసుకుంటాడు. కేసీఆర్‌ అంతా తెర వెనుక ఉండి చూస్తాడంతే. మెదక్‌ బరిలో నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఇక ఢిల్లీలోనే ఎక్కువ మకాం వేయాలనేది కేసీఆర్‌ ఆలోచన. ఓ రకంగా కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు దూరమవుతున్నాడనే చెప్పాలి. టీఆరెస్‌ ను బీఆరెస్‌గా మార్చి ‘తెలంగాణ’ను దూరం చేసిన కేసీఆర్.. ఇప్పుడు స్వయంకృతాపరాధంతో తనూ తెలంగాణకు దూరమవుతున్నాడు.