దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

అధికార పార్టీపై ప్రధాన ప్రతిపక్షం దాడి మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఓటమి పాలైన బీఆరెస్‌.. ఒక్క బాల్కొండలోనే గెలిచింది. బీఆరెస్‌కు జిల్లా కంచుకోటలా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. సిట్టింగులు ఓడారు. అధికారమూ లేదు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్‌దే ఇక్కడ హవా కొనసాగుతోంది. కాగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక దూకుడు పెంచాలని భావిస్తున్న బీఆరెస్‌.. ఆ పనికి జిల్లాలో నాంది పలికింది. ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీని కౌంటర్‌ చేసే పనికి శ్రీకారం చుట్టారు.

బుధవారం ఆమె జిల్లా పర్యటనలో ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించి ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయగా.. బాల్కొండలో గురువారం జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. ముత్యాల సునీల్‌రెడ్డిపై పరోక్షంగా ప్రశ్నల అస్త్రాలు సంధించారు. ప్రొటోకాల్‌ రగడ లేపారు. ఇక దాడి షురూ అయ్యిందనే సంకేతాలిచ్చారు. తన ఫోటో లేకపోవడాన్ని, అధికారులను వేడుకలకు ఆహ్వానించకపోవడాన్ని ఆయన వేదిక మీదే తప్పుబట్టారు. అధికార పక్షాన్ని నిలదీసేంత పనిచేశారు. తొలి కార్యక్రమంలోనే ప్రొటోకాల్‌ వివాదాన్ని తెరపైకి తెచ్చిన మాజీ మంత్రి.. ఇకపై ఇలాంటివి చేస్తే చూస్తూ ఊరుకోమనే విధంగా చురకలంటించారు.ఓ వైపు ప్రజా పాలన పేరుతో హడావుడిగా దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి మొదలైంది.

ఇదే క్రమంలో బీఆరెస్ పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో, దరఖాస్తు చేసుకునే క్రమంలో ప్రజలకెన్నో అనుమానాలున్నాయి. దరఖాస్తులను బ్లాక్‌లో కొని మరీ అప్లై చేసేందుకు సిద్దమయ్యారు. వీటిని స్వీకరించే విషయంలో సరైన నిబంధనలు రూపొందించడంతో ప్రభుత్వం విఫలమైంది. కొత్త, పాత అని లేకుండా అంతా ఒకేసారి ఎగబడటంతో అయోమయ పరిస్తితులు నెలకొన్నాయి. వారం రోజులూ ఇదే హడావుడి ఉండనుంది. ఈ విషయంలో బీఆరెస్‌ ప్రజల వద్దకు వెళ్లి అండగా నిలవాలని భావిస్తోంది.

You missed