వాస్తవం- నిజామాబాద్:
ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్‌లో ఓ ఓబులాపురం గనుల తవ్వకాలకు మించి, కేజీఎఫ్ సినిమాను తలపించేలా క్వారీలు, గనుల తవ్వకాలు అక్రమంగా నడుస్తున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి క్రిష్టారావుకు ఫిర్యాదు చేశారు. ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా మంత్రి అక్రమ మైనింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి వివరించారు. మాక్లూర్‌లో ఇదే విధంగా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు నష్టం కలిగించే రీతిలో కొనసాగుతున్న అక్రమంగా మైనింగ్ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మాచారెడ్డి ఉమ్మడి మండలంలోని మంథని, దేవునిపల్లిలలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ గురించి ఫిర్యాదు చేశారని మంత్రి అన్నారు. భారీ పేలుళ్ల కారణంగా వందలాది బోరు బావులు, నివాస గృహాలు దెబ్బతిన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. గత కొన్నాళ్లుగా అక్రమ మైనింగ్, బ్లాస్టింగ్స్ జరుగుతున్న ఎందుకు చర్యలు చేపట్టలేదని సంబంధిత మైనింగ్, రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. తక్షణమే విచారణ జరిపి వారం రోజుల్లో తనకు సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ మైనింగ్ కారణంగా నష్టపోయిన బాధితులకు మైనింగ్ యాజమాన్యం ద్వారా నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.