దండుగుల శ్రీనివాస్, వాస్తవం ప్రతినిధి:
నిజామాబాద్ ఎంపీ సీటు కోసం నేతలు క్యూ కట్టారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరిగిన జనాధరణ, ప్రభుత్వం ఏర్పాటుతో కొత్త జోష్‌లో ఉన్న కాంగ్రెస్ నేతల కన్ను ఇప్పుడు ఎంపీ సీటు పై పడింది. ఓ వైపు ఎమ్మెల్సీ పదవి కోసం లైన్‌లోనే ఉంటూనే త్వరలో వచ్చే ఎంపీ సీటు కోసం కూడా గాలం వేస్తున్నారు. ఇప్పటికే ఈ సంఖ్య ఏడుగురికి చేరింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఆయనకు ఎంపీగా ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈయనతో పాటు మాజీ ఎమ్మె్ల్యే ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మైనార్టీ కోటాలో తాహెర్ బిన్ హందాన్, రూరల్ టికెట్ ఆశించి భంగపడ్డ కాట్‌పల్లి నగేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ,సీనియర్ నేత అరికెల నర్సారెడ్డిలు ఎంపీగా అవకాశం ఇస్తే చేద్దామనుంటున్నారు. వీరితో పాటు జిల్లాకు చెందిన సినీ నిర్మాత దిల్‌రాజు కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈ సీటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్‌కేక్‌గా మారింది. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొననున్నది.
దీంతో గెలుపు అవకాశాలు మాకంటే మాకు అనే దోరణిలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. బీఆరెస్‌లో మాత్రం స్తబ్ధత నెలకొన్నది. వాస్తవంగా ఎంపీగా కాంగ్రెస్ ఇక్కడ సత్తా చాటింది. కొత్తగా వచ్చిన మధుయాష్కీ లాంటి వారిని కూడా అక్కున చేర్చుకున్నది. ఆ తరువాత నేతల తీరు వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు పరిస్థితి మారింది. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చిన క్రమంలో ఇందూరు నేతల్లో ఇదే మంచి అవకాశమని ఎవరికి వారే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.