జిల్లాపై బీజేపీ పట్టు పెరుగుతోంది. కాదు కాదు బీజేపీ నీడన అర్వింద్ పట్టు పెరుగుతూ వస్తోంది. మెల్లగా జిల్లాను తన గుప్పెట్లో ఉంచుకునేందుకు పావులు కదుపుతున్న అర్వింద్ మెల్లమెల్లగా సక్సెస్ అవుతున్నాడు. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తరువాత ఆయన జిల్లా పార్టీని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. నిజామాబాద్ మున్సిపాలిటీపై గురి పెట్టి దాదాపు మేయర్ సీటు కైవసం చేసుకునేంత వరకు వెళ్లి అధికార పార్టీగా ఉన్న బీఆరెస్ వెన్నులో చలి పుట్టించాడు.
తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అనుకూలమైన వారికే టికెట్లు ఇప్పించుకుని అధిష్టానం వద్ద తన పరపతి ఏపాటిదో నిరూపించుకున్న అర్వింద్.. అందులో రెండు కీలకమైన స్థానాలు కూడా గెలిపించుకోగలిగి కొంత ఉనికి చాటుకోగలిగాడు. తనకు ఎదురు తిరిగిన నాయకులను, బీజేపీ సీనియర్ నేతలను, అసమ్మతి వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టి పార్టీని మొత్తం తన కనుసన్నల్లో చెప్పు చేతల్లో ఉండేలా చేసుకున్నాడు. సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణను జిల్లాలో తనకు అడ్డు తగలకుండా బాన్సువాడకు తరలించి తనకు ఎదురులేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇంకా తన పట్టు బిగిస్తున్నాడు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బస్వా లక్ష్మీనర్సయ్యకు, అర్వింద్‌కు మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది.
అప్పుడు అసెంబ్లీకి పోటీ చేయకుండా అడ్డుకున్న అర్వింద్… ఇప్పుడు పార్లమెంటు టికెట్ కోసం ఆశతో ఉన్న బస్వాను మొత్తానికి పార్టీ నుంచి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్దం చేశాడు. అతనిపై పలువురు సీనియర్ నాయకులు… ఇద్దరు ఎమ్మెల్యేలతో అధిష్టానానికి ఫిర్యాదులు చేయించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు గెలుపుపై ప్రభావం పడేలా నెగిటివ్ ప్రచారం చేశాడనే ప్రధాన ఆరోపణే ప్రధాన అస్త్రంగా బస్వాపై సంధించాడు. త్వరలో బస్వాకు చెక్ పెట్టి తన అనుచరుల్లో ఒకరిని తీసుకొచ్చి జిల్లా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టనున్నాడు. యెండల లక్ష్మీనారాయణకు నిజామాబాద్ ఎంపీ సీటుపై ఆశ చావలేదు. దీంతో అతన్ని మళ్లీ ఈ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టేందుకు జహీరాబాద్‌కు పంపాలనే ఎత్తుగడలో అర్వింద్ ఉన్నాడు. ఇలా తనకు అడ్డంగా ఉన్న నేతలను అడ్డు తొలించుకునేలా.. ఎదురు తిరిగిన నాయకుల ఉనికే లేకుండా చేసేలా తన వ్యూహాలకు పదును పెట్టి సక్సెస్ అవుతున్న అర్వింద్.. జిల్లా పార్టీపై పూర్తి పట్టు సాధిస్తూ వస్తున్నాడు.