కేసీఆర్ పశ్చాత్తాపడతున్నాడు. సిట్టింగులందరికీ టికెట్లివ్వొద్దని ఉన్నా.. మరీ ఇంత దారుణమైన ఓటమిని చవి చూస్తానని ఆయన కలలో కూడా ఊహించలేదు. అందుకే షాక్‌నించి ఆయన ఇంకా తేరుకోలేదు. తన అంతంగీకులతో మాత్రం కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకంటున్నట్లు తెలిసింది. సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వడమే పార్టీ కొంపముంచిందనే అంతర్మథనం ఆయనలో ప్రారంభమైంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దే పనిని త్వరలోనే చేయాలనే సంకల్పం మాత్రం ఆయనలో బలంగా ఉన్నట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఇంచార్జిలను వేయాలనే ఆలోచన చేస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికలు మరో రెండు నెలల్లో ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పుడు ఇంచార్జిల పేరు నాయకత్వ మార్పు నష్టం చేస్తుందా..? అనే ఆలోచనలు కూడా కొందరు చేస్తున్నా.. తప్పనిసరిగా కొన్ని చోట్ల ఇంచార్జిలను వేయడం వల్ల పార్టీకి జవసత్వాలు అందించవచ్చని భావిస్తున్నారు పార్టీ అధినేత. అందుకే ఆయన ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఓడిన వారితో అసలే మాట్లాడటం లేదు. రెండు సార్లు వరుసగా టికెట్లిచ్చి గెలిపించుకున్నదే ఎక్కువంటే..మూడోసారి టికెట్ ఇవ్వడం పట్ల చాలా వ్యతిరేకత మూటగట్టుకున్నాడు కేసీఆర్.
అంతిమంగా ఇది ప్రభుత్వానికే దెబ్బకొట్టింది. కేసీఆర్ కన్న కలలను కల్లలు చేసేసింది. దీంతో ఆయన రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తేవాలంటే సిట్టింగుల పేరుతో నియోజకవర్గాల్లో అరాచకం సృష్టించి తీవ్ర నష్టాలను చవిచూసేలా చేసిన నేతలకు చెక్ పెట్టడమేనని నిశ్చయానికి వచ్చినట్టు తెలిసింది.