దండుగుల శ్రీనివాస్, వాస్తవం ప్రతినిధి:
ఇందూరులో ఫ్యాక్షన్ రాజకీయాలు పడగలెత్తాయి. మొన్న మొన్న ఎన్నికలు ముగిశాయో లేదో కానీ.. అప్పుడే పగ కట్టలు తెంచుకుంటున్నది. ఫ్యాక్షన్ రాజకీయాలు పడగవిప్పుతున్నాయి. ఆర్మూర్, బోధన్ మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌లు టార్గెట్‌గా ప్రతీకార దాడులు షురూ అయ్యాయి. పదేళ్లపాటు పగబట్టిన ప్రతిపక్ష రాజకీయం ఇప్పుడు ప్రతీకార వేటకు దిగింది. ఈ పదేళ్లలో ఎమ్మెల్యేలుగా వారు చేజేతులా కొని తెచ్చుకున్న పరిస్థితులే ఇప్పుడు వారి రాజకీయ భవిష్యత్తుకు గుదిబండగా మారాయి. అక్రమాల పుట్టలు తవ్వుతున్నారు. మొన్నటి వరకు అధికార యంత్రాంగం బీఆరెస్ నాయకులు జీ హుజూర్ అన్నది. ఇప్పుడు కాంగ్రెస్‌కు సలాం కొడుతున్నది.
ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే అయినా మాజీ ఎమ్మెల్యేపై దాడులు తీవ్రతరం చేయడం.. అధికారులు కూడా సహకరికంచడం జీవన్‌రెడ్డిని ఊపిరి సలపనీయకుండా చేసింది. ఇప్పుడు బోధన్‌లో షకీల్ టార్గెట్‌గా శరత్‌రెడ్డి ప్రతీకారవేటకు తెరతీశాడు. చాపకింద నీరులా మొన్నటి వరకు సమయం కోసం వేచి ఉన్న నాయకులు మొన్నటి వరకు అధికారంలో ఉండి చేసిన దురాఘాతాలపై పడ్డారు. అధికార యంత్రాంగం ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నది సహజంగానే. అధికారుల పై వేటు వేయడం లక్ష్యంగా పెట్టుకోలేదు లీడర్లు. ఆ అధికారులతోనే కాగల కార్యం చక్కదిద్దుకునేలా, మాజీలపై ప్రతీకారం తీర్చుకునేలా దాడులకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోనే ఆర్మూర్, బోధన్ నియోజవకర్గాల్లో జరుగుతున్న దాడులు, సంఘటనలు రాజకీయంగా తీవ్ర చర్చకు తెర లేపాయి.