ఇద్దరు ఒకప్పుడు ప్రాణమిత్రులు.. ఒకరి విడిచి మరొకరు ఉండలేని సన్నిహిత స్నేహం. రాజకీయాలకంటే తనకు స్నేహమే ముఖ్యమనుకున్నాడు శరత్‌రెడ్డి. రాజకీయంగా ఓ స్థాయికి తెచ్చాడు షకీల్. అప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే శరత్‌రెడ్డి సతీమణిని బోధన్ మున్సిపల్‌గా షకీల్ చేశాడో.. అప్పటి నుంచి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. షకీల్ చేయమన్న పనల్లా నేను చెయ్య అన్నాడు శరత్. చేస్తావా చస్తావా అనే రేంజ్‌లో షకీల్ వ్యవహరించాడు. ససేమిరా అన్నాడు ప్రాణమిత్రుడు. సీన్ కట్ చేస్తే.. ఇద్దరి మధ్య పెద్ద అగాథం.ఎంతంటే నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్‌కు. చూసుకుందా.. నీ అంతు చూస్తా అనేలెవల్‌కు వెళ్లింది వీరి వ్యవహారం. ప్రాణమిత్రులు బద్ద శత్రువులయ్యారు.
షకీల్ గెలుపులో కీలకంగా ఉన్న శరత్‌రెడ్డి.. ఓడగొట్టే దాక నిద్రపోను అని శపథం పూనేంత వరకు వెళ్లింది వీరి శతృత్వం. రైస్‌మిల్లుల వ్యాపారంలో అపార అనుభవం ఉన్న శరత్‌రెడ్డి.. స్నేహకాలంలో షకీల్‌నూ ఆ రంగంలోకి దింపాడు. వ్యాపార మెళకువలు నేర్పాడు. ఇప్పుడు ఈ ప్రియమైన శ్రతువు.. ఆ వ్యాపారాలపైనే దాడులు చేయించాడు. కలెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేసిన శరత్‌రెడ్డి… బోధన్‌లోని షకీల్‌కు చెందిన రైస్‌మిల్లుల్లో తీవ్ర అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆధార పూర్వకంగా చేసిన పిర్యాదులందుకున్న అధికారులు మెరుపు దాడులు చేశారు. లెక్కలు తీస్తున్నారు. మొన్నటి వరకు కిమ్మనకుండా ఉన్న అధికారులే ఇప్పుడు విశ్వరూపం చూపుతున్నారు. లోతుల్లోకి వెళ్లి అక్రమాలపై పూర్తి లెక్కలు తీసే పనిలో పడ్డారు. కోట్లలో సీఎంఆర్ అక్రమాలు జరిగాయనేది తేలింది. దీనిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు బోధన్‌లో ఇదే చర్చ.
ప్రాణమిత్రుడి ఓటమికి కంకణం కట్టుకుని కాంగ్రెస్‌లో చేరిన శరత్‌రెడ్డి.. సుదర్శన్‌రెడ్డి గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. కేబినెట్‌లో కీలక మంత్రి పదవి కూడా సుదర్శన్‌రెడ్డికి దక్కనుంది. ఓ రకంగా ఇక్కడ షాడో ఎమ్మెల్యే శరత్‌రెడ్డే. ఇంకేముంది…? ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు తక్కవేం కాకుండా ప్రతీకార దాడులకు వేదిక కానుంది బోధన్. రైస్‌మిల్లుల పై దాడులతో దీనికి నాంది పలికాడు శరత్‌రెడ్డి. ఆ తరువాత భూ కబ్జాలు, అక్రమాలే టార్గెట్‌గా మరో అస్త్రాన్ని సంధించేందుకు సర్వం రంగం సిద్దం చేసుకున్నాడు శరత్‌రెడ్డి. ఒకటి తరువాత ఒకటి రాజకీయ ప్రతీకారవేట ఇందూరు జిల్లాలో కొనసాగనున్నాయి. నిన్న ఆర్మూర్, ఇవాళ బోధన్.. ఇంకా ఎపిసోడ్‌లో మిగిలే ఉన్నాయి.