( దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి: )

కాలం మారింది. మార్పు కాటేసింది. ఒకప్పుడు పరపతి. ఇప్పుడు అథోగతి. మొన్నటి దాకా మాటే శాసనం. ఇప్పుడు ముఖమే బంగారం. ఎవరూ పత్తాకు లేరు. పార్టీ అంతా కకావిలకం. అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఓ గర్వభంగం. ఓ తగిన శాస్తి. ఇదీ ఓ మార్పుకు సంకేతమే. కానీ తేరుకునేదెప్పుడు…? మళ్లీ పూర్వవైభవానికి నడుం కట్టేదెప్పుడు..? ఇప్పుడిదే ఇందూరు బీఆరెస్ క్యాడర్‌ను, నాయకత్వాన్ని పీడిస్తున్న సమస్య.బీఆరెస్‌కు కంచుకోటలా ఉన్న ఇందూరు ఇప్పుడు ఏకాకి అయ్యింది. అంటే .. ఐదింట్లో ఒక్క బాల్కొండే ముక్కీ మూలిగి గెలిచి భయటపడింది. మిగిలిన నాలుగు ఢమాల్‌. పార్లమెంటు ఎన్నికలు సమీపానే పొంచి ఉన్నాయి. ఎంపీగా కవితే పోటీ చేయాలనే బలమైన వాదన క్యాడర్ నుంచి వినిపిస్తోంది. జిల్లాకు అధ్యక్షుడు ఉన్నా లేని కిందే లెక్క చాలా రోజులుగా. జిల్లా అధ్యక్షుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. ఆమే ఎంపీగా నిలబడాలి.

సమన్వయం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరికి వారే గ్రూపులు నడిపి ఘోర పరాభవం చవి చూసిన పరాజిత ఎమ్మెల్యేలకు చెక్‌ పెట్టాలి. తనకంటూ పార్టీలో ఇప్పటికైనా ఓ ప్రత్యేకతను ఆమె చాటుకోవాలి. జిల్లా అంతటా ఆమే తానై నడించాలి. ఇప్పుడు ఇదీ కోరుకుంటున్నాడు సగటు కార్యకర్త, బీఆరెస్‌ అభిమాని. కవితే ఇప్పుడు ఈ కష్టకాలంలో పెద్దదిక్కుగా నిలవనుంది. రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మూడోసారి మహా పెద్ద వ్యతిరేకతను మూటగట్టుకుని ఓటమి పాలైన నేతలను ఇక పార్టీ వీడాలి. గుడ్‌బైచెప్పాలి. ప్రజల అభీష్టానికి అనుకూలంగా వ్యవహరించాలి. పార్టీని, పార్టీని నమ్ముకున్న క్యాడర్‌ను కాపాడుకోవాలి. అలా చేయలంటే ఒక్క కవితతోనే సాధ్యం.

ఇంతకాలం ఆమె పట్టించుకోకనే పరిస్థితి ఇలా తయారయ్యింది. ఏ ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యేకే పూర్తి అధికారాలు కట్టబెట్టి వారి ఆకృత్యాలను కళ్లారా చూస్తూ ప్రేక్షక పాత్ర వహించింది కవిత. అందుకే పార్టీకి ఇందూరు జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందనేది రాజకీయ విళ్లేషకుల అంచనా. ఇకనైనా కవిత తన పంథా మార్చుకోవాలని కోరుకుంటున్నారు. మారిన కవితలా పార్టీ మేలు కోరే ప్రతీ కార్యకర్తలను కాపాడుకునే మహాత్కార్యాన్ని భుజానికెత్తుకోకపోతే మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ కష్టకాలంలో కూడా ఆమె ఉద్యమ పంథా, యుద్ద రీతిని వీడొద్దనేది బీఆరెస్‌ కార్యకర్తల ఆకాంక్ష. నిజామాబాద్‌ ఎంపీగా ఆమే బరిలో ఉండాలనే బలమైన కోరిక అందరిలో ఉంది. అందుకే ఆమె మళ్ల యాక్టివ్‌ రాజకీయాల్లోకి రావాలె. జిల్లా పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలి. ఇది సాధ్యమా..? రాజకీయాల్లో అసాధ్యమేమీ లేదు. వెయిట్‌ అండ్‌ సీ.

You missed