దండుగుల శ్రీనివాస్, వాస్తవం ప్రతినిధి:
ఈరవత్రి అనిల్. బీసీ నేత. జిల్లాలో ఎక్కువ సామాజికవర్గం ఉన్న పద్మశాలి వర్గానికి చెందినవాడు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఆ తరువాత అంతా రాజకీయ శూన్యత ఏర్పడింది. విధి రాజకీయంగా అనిల్‌తో ఆటలాడుకుంది. కాంగ్రెస్‌లో చేరినా… మళ్లీ బాల్కొండ నుంచి పోటీ చేసినా అదృష్టం వరింలేదు. లక్కీ కలిసిరాలేదు. దీంతో ఓపికగా ఆ పార్టీలోనే ఉంటూ వచ్చాడు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో బీసీ కోటా కింద తనకు బాల్కొండ టికెట్ ఇస్తారని భావించాడు. కానీ కుదరలేదు. కనీసం ఆర్మూర్ నుంచైనా పోటీ చేద్దామనుకున్నాడు. అదీ కుదరలేదు.
ఆఖరికి తన సామాజికవర్గం బలంగా ఉన్న అర్బన్ నుంచైనా అవకాశం ఇవ్వండని దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ ససేమిరా అంది. ఎన్నో సమీకరణల మధ్య తను మాత్రం ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై త్యాగం చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితో మంచి సంబంధాలు నెరుపుతూ వచ్చాడు. కామారెడ్డిలో రేవంత్ పోటీ చేస్తే తనను అబ్జర్వర్‌గా పంపితే అక్కడ విజయవంతంగా తన విధులు పూర్తి చేసి అధిష్టానం వద్ద శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అనిల్‌పై రేవంత్ నజర్‌పెట్టాడు. పద్మశాలి కులానికి కాంగ్రెస్ ఎక్కడా న్యాయం చేయలేదు. టికెట్ ఇవ్వలేదు. ఇప్పటికైనా అనిల్‌ను ఎమ్మెల్సీ చేసి మండలికి పంపితే ఆ కులానికి న్యాయం చేసినట్టవుతుందని, విధేయతకు పట్టం కట్టినట్టవుతుందని రేవంత్ భావిస్తున్నాడు. ఇప్పుడు అనిల్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నాడు. కాదు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నాడు. సరైన సమయమే మిగిలి ఉంది.