(దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి)

ఇందూరు ఓటరు విలక్షణ తీర్పునిచ్చాడు. నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కటి మాత్రమే బీఆరెస్‌కు ఇచ్చి మిగిలినవి చెరో రెండు పంచుకున్నాయి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు. బాల్కొండ మాత్రం బీఆరెస్‌కు అత్తెసరు మెజారిటీతో గెలిపించింది. ఆర్మూర్‌లో మంచి మెజారిటీతో గెలిచాడు బీజేపీ అభ్యర్థి పైకి రాకేశ్‌ రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌లో కూడా అదే పరిస్థితి. ధన్‌పాల్‌కు పార్టీలకతీతతంగా ఓటేసి గెలిపించారు.బోధన్‌లో కూడా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అత్తెసరు మార్కులతో బయటపడ్డాడు. రూరల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేకులపల్లి భూపతిరెడ్డికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు.

సరే, ఇదంతా ఒడిసిన ముచ్చట. ఇప్పుడు మళ్లీ ఎందుకంటారా ఇదంతా…? ఇలా విచిత్రమైన, విలక్షణమైన తీర్పునిచ్చిన ప్రజలకు నాయకులు అదే రీతిలో విలక్షణ షాక్‌ నిస్తున్నారు. అంటే తాము గెలిపించిన ఎమ్మెల్యేలు ఇక్కడ డమ్మీలు. వారి స్థానంలో షాడోల రూపంలో తెర వెనుక వెరొకరు పెత్తనం చెలాయిస్తారన్నమాట. సహజంగా ఇలాంటివి రాజకీయాల్లో కామనే.కానీ ఈసారి బీఆరెస్‌ తప్ప బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు బలమైన అభ్యర్థులనే పోటీకీ ధీటుగా నిలిపింది.అందుకే జనాలు కూడా వెనుకాముందు చూడకుండా బలంగా ఓట్లు గుద్దారు అధికారపక్షం మీద కసితో. కానీ గెలిచిన లీడర్‌ మరొకరి చేతిలో కీలుబొమ్మలా మారడమే ఇక్కడ జనాలకు నచ్చనిది. అసలేం జరుగుతుందో ఓసారి ఈ ముచ్చట చూద్దాం..! ఆర్మూర్‌పై ఎంపీ అర్వింద్‌కు మొదటి నుంచి కన్ను ఉంది. ఇక్కడ జీవన్‌రెడ్డిపై తన గెలుపు చాలా సునాయసంగా ఉంటుందని ఎప్పట్నుంచో ఖర్చీఫ్‌ వేసుకుని కూసుకున్నాడు.

కానీ అనూహ్యంగా పారిశ్రామిక వేత్త రాకేశ్‌రెడ్డి తను రాజకీయాలకు కొత్తయినప్పటికీ ఢిల్లీ లెవల్లో తన ఆర్థిక పరపతితో చక్రం తిప్పాడు. దీంతో అర్వింద్‌ కూడా కిమ్మనలేదు. కోరుట్లను ఎంచుకోక తప్పలేదు. నిజామాబాద్‌ అర్బన్‌ కూడా అర్వింద్‌ చేతుల్లోనే ఉంది. అదీ తనకు అనుంగు అనుచరుడిగా ఉన్న ధన్‌పాల్‌కు ఇస్తే.. గెలిస్తే అర్బన్‌ లో మళ్లీ తన హవాకే కొసాగుతుంది. పార్టీ తన కనుసన్నల్లోనే ఉంటుందనేది అర్వింద్‌ ఎత్తుగడ. ఆ విధంగానే ఎత్తులు వేశారు. అధిష్టానాన్ని ఒప్పించాడు. చివరకు ఇద్దరినీ గెలిపించుకోవడంతో కీలకంగా వ్యవహరించాడు. ఇప్పుడు అర్బన్‌, ఆర్మూర్‌ నియోజవర్గాల్లో షాడో ఎమ్మెల్యే అర్విందే. తనకు తెలియకుండా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు చేసేదేమీ ఉండదు.

ప్రాంతీయ పార్టీలకు ఏ మాత్రం తీసిపోకుండా బీజేపీలో కూడా ఇదే పంథా కొనసాగుతుంది. ఇక్క బీజేపీయే కాదు. బోధన్‌లో పేరుకు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డే కానీ అక్కడంతా తూము శరత్‌రెడ్డిదే నడుస్తది. షకీల్‌పై సవాల్‌ చేసి తొడలు చరిచి మరీ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న శరత్‌ .. తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. ఎలాగోలా సుదర్శన్‌రెడ్డిని బయటపడేశాడు. చిరకాల మిత్రుడు, శత్రవు అయిన షకీల్‌పై పైచేయి సాధించి షరతు నెగ్గాడు శరత్. ఇప్పుడక్కడ షాడో ఎమ్మెల్యే శరతే. ఇక రూరల్‌లో కూడా పరిస్థితి అంతే ఉంది. చివరి నిమిషంలో పార్టీలో చేరాడు మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు. తనవల్లే రూరల్ ఎమ్మెల్యే గెలిచాడనే టచింగ్‌ ఇచ్చాడు మండవ. దీంతో మళ్లీ మండవ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. ఇప్పుడు జిల్లాలో రాజకీయం ఇలా నడుస్తుంది. మున్ముందు మరెన్ని చిత్ర, విచిత్రాలు చూడాలో మరి.

You missed