(Dandugula Srinivas)

 

ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడు ఆర్మూర్‌లో అగ్గి రాజుకుంది. ఆర్మూర్‌ అంటేనే అంతే. పంతం పడితే అంతు తేలాల్సిందే. పగ బడితే ప్రాణాలు తీయాల్సిందే. కక్ష కడిగే పాతాళానికి తొక్కొయ్యాల్సిందే. అక్రమ కేసులతో జైళ్ల పాలు చేసి గజ్జున వణికియ్యాల్సిందే. పదేళ్లుగా ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే మారాడు. బీజేపీ ఎమ్మెల్యేగా రాకేశ్‌రెడ్డి గెలిచాడు. కానీ అవే రాజకీయాలు నడుస్తున్నాయక్కడ. మొన్నటి దాకా మీ లెక్క.. ఇప్పుడు మా లెక్క. కాస్కోండిరా.. మీ అంతు చూస్తా అనే లెవల్లో రాకేశ్‌ రెచ్చిపోతున్నాడు.

సవాల్‌ విసురుతున్నాడు. కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. తనను చంపుతానని బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పిన ఆయన…. మీలాంటి వారిని ఎంతో మందిని చూసి వచ్చానన్నాడు. చాలా సార్లు చచ్చి బతికిన నన్ను చంపడం మీ తరం కాదు.. మీ చిల్లర రాజకీయాలు,బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్‌ పద్దతులు వీడి అభివృద్ధి కి సహకరించండని హితవు పలికాడు రాకేశ్‌. పనిలో పని మగధీర సినిమా గురించి కూడా ప్రస్తావించాడు. మగధీరలో హీరో అందరికీ చంపి తాను చచ్చినట్టు.. మిమ్మల్నెవర్నీ వదిలా నా జోలికొస్తే అందరినీ చంపుతానని వార్నింగ్‌ ఇవ్వడం కలకలం రేగింది. జిల్లాలో ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. జీవన్‌ రెడ్డి మాల్‌ను క్లోజ్‌ చేపించేందుకు రంగంలోకి దిగిన రాకేశ్‌.. ఆర్టీసీ అధికారులను ఉసిగొలిపాడు.

కరెంటు బకాయిలు కట్టలేదని ఆర్మూర్‌లోని జీవన్‌ మాల్‌కు కరెంటు కట్ చేయించాడు రాకేశ్‌. ఇది చాలదంటూ మాక్లూర్‌ మండలంలోని గుట్టల్లన్నీ జీవన్‌రెడ్డి బామ్మర్ది, రాజేశ్వర్‌గౌడ్‌లు ఇష్టానుసారం తవ్వేస్తున్నారని మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో జేసీబీలు, టిప్పర్లు సీజ్‌ చేసి కేసులు పెట్టారు. ఎక్కడ ఏ నియోజకవర్గంలోని లేని విధంగా ఇక్కడ జీవన్‌ మంత్రాన్నే జీవన్‌పై ప్రయోగిస్తున్నాడు రాకేశ్‌. ప్రతీకార వేట మొదలైంది. ఇది మొదలు మాత్రమే. ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. ఆర్మూర్ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లోనే సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్న జీవన్‌ను టార్గెట్‌ చేయడం పట్ల జిల్లా బీఆరెస్‌ శ్రేణులు, అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటున్నది.

You missed