కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎన్నోసార్లు అవకాశం ఇచ్చినా ..ఓడిన నేతగా గుర్తింపు పడ్డ షబ్బీర్ అలీ కి ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే విధి ఒకటి తలిచిందని… కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడంతో అక్కడ రేవంత్‌ను బరిలోకి దింపింది అధిష్టానం. అర్బన్ నుంచి పోటీకి సిద్దమై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుని శక్తి వంచన లేకుండా కృషి చేశాడు షబ్బీర్. కానీ ఇక్కడా అదృష్టం ముఖం తిప్పేసింది. ఖర్మ తన్నేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ తనకు ఆశలు చిగురించాయి.
మైనార్టీ కోటాలో తప్పకుండా తనకు మినిస్ట్రీ వస్తుందని అంతా భావించారు. కానీ అధిష్టానం షబ్బీర్‌కు షాక్ ఇచ్చింది. ఓడిన నేతలెవరికీ మంత్రి పదవి ఇవ్వడం వద్దని తెగేసి చెప్పేసింది. దీంతో షబ్బీర్‌కు మంత్రి పదవి ఆశలు చచ్చిపోయాయి. మైనార్టీ కోటాలో అజారుద్దీన్ ఉన్నాడు. అతనికేమైనా ఇస్తారో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే షబ్బీర్‌కు చెక్ పడినట్టే. రేవంత్ టీమ్‌లో కీలకంగా ఉన్న షబ్బీర్‌కు.. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం శాపంగా మారింది. దీంతో సీనియర్ నేతగా, ఓటమి లీడర్‌గా , దురదృష్టం వెంటాడుతున్న నాయకుడిగానే మిగిలిపోనున్నాడు షబ్బీర్.
అసలే ఇవి చివరి ఎన్నికలని పోటీలో దిగాడు. అందులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ పూజారి కరుణించినా దేవుడు వరమివ్వలేదన్నట్టు షబ్బీర్ విషయంలో ఇలా సీన్ తిరగబడింది. రెంటికి చెడ్డ రేవడిగా షబ్బీర్ మిగిలిపోనున్నాడా..? పరిస్థితులు అలాగే ఉన్నాయి మరి.