కొత్తగా ఏర్పడిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్‌లో ఉమ్మడి జిల్లాకు చాన్స్ దొరకలేదు. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేరు ఖరారయిందనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన ప్రస్తావనే లేకుండా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేరు కూడా వస్తుందని భావించినా.. అతని పేరు కూడా పక్కనపెట్టేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నీకా..? నాకా..? అనే రేంజ్‌లో ఇద్దరూ అధిష్టానం వద్ద ఒత్తిడి పెంచినా ఫలితం లేకుండా పోయింది. స్వయంగా సోనియా, రాహుల్, ప్రియాంకలు హాజరైన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా నుంచి ఎవరి ప్రాతినిథ్యం లేకపోవడం చర్చకు తెర తీసింది.
చావు తప్పి కన్నులొట్టబోయిందనే రీతిలో షకీల్ పై సుదర్శన్‌రెడ్డి గెలిచాడు. ఆయన వద్దు వద్దంటూనే ఈసారి పోటీలో ఉన్నాడు. రాజకీయాలకు దాదాపు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడు. ఈ టర్మే ఆయనకు ఆఖరిది. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో తనకు మంత్రి పదవి ఖాయమని తలిచినా ఎందుకో అధిష్టానం పక్కన పెట్టేసింది. ఇక మైనార్టీ కోటాలో షబ్బీర్ కూడా ఈసారి కీలక మంత్రి పదవి ఆశించాడు. కానీ ఓడిపోయాడు. ఓడినా తనకు కేబినెట్‌లో బెర్త్ ఖరారనే అనుకున్నాడు. కానీ వరుసగా ఓటమి పాలైన షబ్బీర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలా..? వద్దా.. ? అనే ఆలోచనలు కూడా చేసింది అధిష్టానం. సుదర్శన్‌రెడ్డికి ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించినా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అందరినీ గెలుపించుకోలేకపోయాడు. కనీసం ఆ వైపు ప్రయత్నం కూడా చేయలేకపోయాడు. పైగా తను సూచించి టికెట్లు ఇప్పించుకున్న అభ్యర్తులు ఓటమిపాలవ్వడం, రేవంత్‌కు సుదర్శన్‌రెడ్డికి మధ్య బంధుత్వం కూడా అవరోధంగా మారిందనే ప్రచారం ఉంది.