అతను రెండు టర్ములు ఆర్మూర్‌కు ఎమ్మెల్యే. కేసీఆర్‌ కుటుంబానికి సన్నిహితుడిగా పేరు. మొన్నటి వరకు అతనంటే హడల్‌. ఇప్పుడిలా ఓడిండో లేదో.. అప్పుడే అతనిపై ముప్పేట దాడి మొదలైంది. అతనే ఆశన్నగారి జీవన్‌రెడ్డి. ఇతను బీఆరెస్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా. ఆర్మూర్ లో ఆర్టీసీకి చెందిన స్థలంలో బస్టాండ్‌ సమీపంలో పెద్ద షాపింగ్‌ మాల్‌ ఒకటి లీజ్‌కు తీసుకు నడుపుతున్నాడు జీవన్‌. దశాబ్దకాలంగా అధికారంలో ఉండటంలో లీజ్‌ మొత్తం చెల్లంచలేదు. మధ్యలో సజ్జనార్‌ ఫైనల్‌ లేఖ రాసినా పెద్దగా స్పందనలేదు. తాజాగా.. జీవన్ తాజామాజీ ఎమ్మెల్యే కావడం.. బీఆరెస్‌ కూడా అధికారంలోకి రాకపోవడంతో ఇటు బీజేపీ, అటు రేవంత్‌ జీవన్‌పై ముప్పేటదాడి మొదలుపెట్టారు.

ఆర్టీసీ సిబ్బంది గురువారం లీజ్‌ మొత్తం కోట్లలో బాకి ఉన్నందున కిరాయిదారులు గమనించాలని చాటింపు వేయడం కలకలం రేపింది. మరోవైపు కరెంటు ఆఫీసర్లు వచ్చి ఆ మాల్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ కట్ చేశారు. ఎన్నికల సమయంలో ఓవైపు బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పదే పదే ఇదే విషయాన్ని తన ప్రసంగంలో వాడుకున్నాడు. సామాన్యులు ఒక నెల కిరాయి కట్టకపోతే తాళం వేస్తారని,మరి ఏళ్లకు ఏళ్లు లీజ్‌ మొత్తం చెల్లించకున్నా ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నించాడు. రేవంత్‌రెడ్డి కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఈ షాపింగ్‌ మాల్‌ గురించే ప్రస్తావించాడు. ఇప్పుడు జీవన్‌కు అధికారం లేకపోవడంతో రెండు వైపులా ఒత్తిడి పెరిగింది. ముప్పేట దాడి మొదలైంది. పొలిటికల్ ప్రతీకార వేట షురూ అయ్యింది.