దురాశ దుఃఖానికి….

మధు యాష్కీ మధ్యలోనే ఆగం.. ఓపిక వహించిన మహేశ్‌కు ఇంకా జనంలో..

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహేశ్‌కు కీలక పాత్ర..

ఇందూరు రాజకీయాలకు దూరమైన మధుయాష్కీ..

రెంటికీ చెడ్డ రేవడి… మధు. సహనం వహించిన మహేశ్‌కు మంచి పొజిషన్‌..

వాస్తవం- పోస్టుమార్టం

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

 

లాంగ్‌రన్‌ రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఓపిక చాలా అవసరం. అవకాశవాద రాజకీయాలు ఎప్పుడూ పనిచేయవు. ఉపయోగపడవు. దెబ్బకొడతాయి. ఇందూరు కాంగ్రెస్‌లో ఈ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మధుయాష్కీల రాజకీయ ఉదంతాలు ఉదాహరణకు తీసుకుంటే ఈ విషయం మళ్లీ నిరూపితమవుతుంది. మహేశ్‌ చాలా కాలంగా కాంగ్రెస్‌లో ఉన్నాడు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ట్రై చేసి ఘోరంగా ఓడిపోయాడు కూడా. కానీ మధుయాష్కీ మధ్యలో వచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని తన ప్రతిభే అని భ్రమించాడు.ఎంపీగా ఓ సారి గాలిలో గెలిచాడు. ఇక తనకు తిరుగలేదనుకున్నాడు. ఆ తర్వాత కూడా అధిష్టానం ఎంపీగా అవకాశం ఇచ్చినా.. సిద్ధాంతాలు పక్కన పెట్టి అర్వింద్‌ గెలుపు కోసం, కవిత ఓటమి కోసం బీజేపీకి సపోర్టు చేసి పార్టీని బొంద పెట్టాడు. అదే సమయంలో తన రాజకీయ భవితవ్యానికీ సమాధి కట్టుకున్నాడు.

ఆ తరువాత ఆయన జిల్లా రాజకీయాలకు దూరమయ్యాడు. మహేశ్‌ జిల్లాను వదిల్లేదు. అధిష్టానం ఈ ఇద్దరు గౌడ్‌లకు మంచి అవకాశాలే ఇచ్చింది. మహేశ్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మధుకు ప్రచార కార్యదర్శి ఇచ్చి సముచిత గౌరవాన్ని ఇచ్చింది. కాంగ్రెస్‌ గాలిలో ఈసారి ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దామనుకున్నారు. అర్బన్‌ నుంచి మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చివరి వరకు ప్రయత్నించినా అధిష్టానం వారించింది. అధిష్టానం మాట జవదాటలేదు. కానీ మధు వినలేదు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఎల్బీనగర్‌ను ఎంచుకున్నాడు. రంగారెడ్డిలోనే తను పుట్టాననే వాదనను తెరపైకి తెచ్చి అధిష్టానం పై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే సీటు సాధించుకున్నాడు. వాస్తవంగా ఆర్మూర్‌ నుంచి మధుకు అధిష్టానం అవకాశం ఇచ్చేది.

కానీ జిల్లాలో ఆయనకు ముఖం లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు ఎల్బీనగర్‌లో ఓడాడు. జిల్లాకు ముఖం చూపని విధంగా రాజకీయంగా తిరోగమనం పాలయ్యాడు. కానీ మహేశ్‌ మాత్రం ఇప్పుడు కీలకంగా మారాడు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనది ఇప్పుడు ప్రభుత్వంలో కీలకపాత్ర కానుంది. మధ్యలో వచ్చినోడు మధ్యలోనే పోతాడు అన్నట్టు … మధుయాష్కీ అనాలోచిత, అవకాశవాద రాజకీయాలతో బలయ్యాడు.ప్రజలకు దూరమయ్యాడు. అదే మహేశ్‌ ఇంకా జనంలోనే ఉన్నాడు. జనంతో ఉన్నాడు. మీడియాలోనూ ప్రముఖంగా ఉంటున్నాడు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా కూడా మారాడు.