నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అంతా తానై ఒంటెత్తు పోకడలతో పోవడం చాలా మందికి పడటం లేదు. బీఆరెస్‌లో టికెట్‌ రాక తిరుగుబాటు చేసి బీజేపీలోకి పోయిన బస్వా పరిస్థితి అక్కడ కూడా అలాగే అయ్యింది. దీనికి అర్వింద్‌ కారకుడయ్యాడు. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా.. అతని కోరిక మాత్రం అర్బన్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉండాలని. కానీ అర్వింద్‌ తన అనుచర గణానికే ప్రయార్టీ ఇస్తూ వస్తున్నారు. అందులో బస్వా లేడు. వాస్తవానికి బస్వా లక్ష్మీనర్సయ్యను అర్వింద్‌ ఆది నుంచి నమ్మడం లేదు.

అయినా ఓపిక పట్టాడు. పార్టీ పెద్దలతో సంబంధాలు నెరుపుతూ వచ్చినా.. ఇక్కడ జిల్లాలో మాత్రం అర్వింద్‌ పెత్తనమే కొనసాగింది. అర్బన్‌లో మున్నూరుకాపుల తరువాత అత్యధికంగా ఉన్న సామాజికవర్గంలో పద్మశాలి ఒకటి. తను ఆ సామాజికవర్గానికే చెందిన వాడని కాబట్టి, బీసీగా తనకే టికెట్‌ ఇవ్వాలని కోరుతూ వచ్చాడు బస్వా. కానీ అర్వింద్‌ బస్వా కోరికను ఎప్పటికప్పుడు తొక్కతూ వస్తూనే ఉన్నాడు. చివరకు పద్మశాలివర్గానికి చెందిన బోగ శ్రావణికి జగిత్యాల జిల్లా నుంచి టికెట్‌ ఇప్పించుకున్నాడు. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఓ పద్మశాలికి ఇచ్చామనే విధంగా… ఇక్కడ అర్బన్‌లో బస్వాకు చెక్‌ పెట్టి ధన్‌పాల్‌ సూర్యనారాయణకు టికెట్‌ ఇప్పించుకున్నాడు.

దీంతో బస్వా కినుక వహించాడు. ఇటు పార్టీలో ఇమడలేడు. బయటకు పోలేడు. అర్వింద్‌ను ఎదురించి నిలవలేడు. కానీ తన సామాజికవర్గానికి మాత్రం తనకు అన్యాయం జరిగిందనే సంకేతాన్ని మాత్రం పంపాడు. దీంతో వీరంతా బీజేపీకి ఖిలాఫ్‌ చేస్తారనే ప్రచారం జరిగింది. ధన్‌పాల్‌ తరపున బస్వా ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. దీంతో పద్మశాలీల ఓట్లు ఎటు వైపు పడుతున్నాయి. ఎవరి గెలుపులో కీలకం కానున్నాయి..? అనేది ఇపుడ సర్వత్రా చర్చకు వస్తోంది.

You missed