నిజామాబాద్ అర్బన్‌లో లోకల్ ఎమ్మెల్యే, బీఆరెస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తాకు, బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణల మధ్య జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లకు బ్రేక్ పడింది. ఈ చర్చకు తెరపడింది. రా చూస్కుందాం… చర్చించుకుందాం… అనే రేంజ్ లో సాగిన చాలెంజ్‌లకు తెరదించేశారు బిగాల. ఇవాళ పార్టీ ఆఫీసులో ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. తాను అభివృద్ధి గురించి చర్చించుకుందాం రా.. అని సవాల్ విసిరితే ధన్‌పాల్ పక్కదారి పట్టించి బురద జల్లే ప్రయత్నం చేశారంటూ ధ్వజమెత్తారు.
అభివృద్ది ఏమేమీ చేశానో ప్రజలకు ఈ చర్చ ద్వారా వివరించాలనేది తన అభిమతమని, కానీ దీనిపై చర్చించే దమ్ము లేక ధన్‌పాల్ దీన్ని పక్కదారి పట్టించి తనపై కబ్జా ఆరోలపణలు చేశారని అన్నారు. కబ్జాలు, ఆరోపణలపై తీరిగ్గా ఎన్నికల తరువాత మాట్లాడుకుందాం.. గానీ ఇప్పుడైతే నీతో మాట్లాడేంత సమయం లేదన్నారాయన. తాను బిజీగా ఉన్నానని, తను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మరోసారి ఆశీర్వదిస్తే తను అర్బన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మేనిఫెస్టోను వివరించే పనిలో ఉన్నానని, మీరు చేసిందేమీ లేక చెప్పేందుకు ముఖం లేక ఇలా.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలవాలనే చీప్ టెక్నిక్‌ను ప్రయోగిస్తున్నారని, మీ మాటలు వినే సమయం తనకు లేదని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు.
హుందా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నానని, మీలాగా రోజుకో ఆరోపణ చేసుకుంటూ జనాల్లో ఉండాలనే భ్రమించే మనస్తత్వం తనది కాదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వడానికి 8వేల రూపాయల ఖర్చవుతుందని, అది ఇంటిదారులే భరించాలి.. కానీ ప్రభుత్వం ద్వారా ఆ ఖర్చు భరించేలా టెండర్లు పిలిస్తున్నామని, దీంతో పాటు ఇరవైన నాలుగ్గంటల మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇలా తను ప్రజలకు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని, అవన్నీ మూడోసారి గెలవగానే తన సొంత మేనిఫెస్టో కింద తీసుకుని ప్రభుత్వ సహకారంతో వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నానని, దమ్ముంటే మీరు కూడా తనకంటే ఏమేమీ ఎక్కువ చేసి చూపిస్తారో చెప్పాలన్నారు. కాగా పక్కదారి పట్టిన ఈ రాజకీయ చాలెంజ్‌లకు బిగాల ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే. మరోవైపు నగరంలోని కంఠేశ్వర్ ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాజకీయంగా ఈ చాలెంజ్‌ను అడ్వాంన్‌టేజ్‌గా తీసుకుని బీజేపీ శ్రేణులు అక్కడ గలాటా చేస్తాయని భావించారు. సోమవారం మధ్యాహ్నం వరకు దీనిపై అర్బన్ రాజకీయాల్లో చర్చోపచర్చలు కొనసాగాయి.