అస్తవ్యస్తంగా ఉన్న కామారెడ్డి బీఆరెస్‌ను చమటోడ్చి, శ్రమకోర్చి చక్కదిద్దుతున్న రామన్నకు లోయపల్లి నర్సింగరావు రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో రెడ్ల ఆగ్రహానికి పార్టీని బలి చేసే విధంగా మారిన మాచారెడ్డి ఎంపీపీ చర్యలు అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. మాచారెడ్డి జడ్పీటీసీ రాంరెడ్డిపై నర్సింగ్‌రావు, అతని అనుచరులు ఇష్టానుసారం దాడి చేయడంతో రెడ్డి సామాజికవర్గమంతా భగ్గుమన్నది. రోడ్డుకెక్కింది. రచ్చ చేసింది. దిష్టిబొమ్మల దహనాలతో మరింత ఆజ్యం పోసినట్టయ్యింది ఈ పంచాయితీకి. దీనిపై కేటీఆర్‌కు పిర్యాదులు వెళ్లాయి.

అక్కడ పరిస్థితి రెడ్డి వర్సెస్‌ వెలమలా తయారయ్యింది. ఇది కాస్తా కాంగ్రెస్‌ నెత్తిన పాలు పోసేలా మారిందనే సంకేతాలు వెళ్లడంతో అధిష్టానంలో ఒకింత అలజడి మొదలయ్యింది. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా అన్నట్టు లోయపల్లి నర్సింగరావు చేసిన పొరపాటు.. రామన్న ఇన్ని రోజులు కష్టపడినదంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందనే అభిప్రాయం బీఆరెస్‌ పార్టీలో ఏర్పడింది.

You missed