ఆయన ప్రసంగం జనంతో ఓ ముచ్చట పెట్టినట్టుగా ఉంటది. ఎర్రటి ఎండలో కూడా గంటల తరబడి ఆ పెట్టే ముచ్చట ఎండతీవ్రతను కూడా తగ్గించేలా ఉంటది. మామూలుగా ఎవరైనా లీడర్‌ ఊర్లకు వచ్చిండంటే మూతి తిప్పుకుంటారు జనం. అదీ ఎన్నికల వేళ.. మామూలే కదా అన్నట్టుగా మొక్కుబడిగా వచ్చి హాజరై పోతూ ఉంటరు. చెప్పింది ఆ చెవిన విని ఈ చెవిన వదిలేస్త ఉంటరు కూడా. కొందరి ప్రసంగం రెచ్చగొట్టేదిగా ఉంటది. ఆ దోరణి స్పీచ్‌ కొంత మందికి నచ్చుతది. కానీ అదీ కొంత సేపే. అదో ఉత్ప్రేరకమన్నమాట. అంతే బుస్సున పొంగి చల్లారే పాలపొంగులా. కానీ చాలా అరుదుగా కొద్ది మంది లీడర్లు మాత్రమే జనంతో మమేకమై మాట్లాడతారు. అదీ ఓ ముచ్చట చెప్పినట్టుగా. వాళ్ల మనసులో మంచిచెడూ గ్రహించినట్టుగా. ఇంకా ఏం కావాలో తెలుసుకున్నట్టుగా. ఇట్టే పసిగట్టేస్తారు. ఆ నాడి పట్టేస్తారు. మనసున మాట తెలుసుకుని మాట్లాడే లీడర్లు కొందరే. అలాంటి నేతల్లో ఒకరిగా చెప్పొచ్చు వేముల ప్రశాంత్‌రెడ్డిని.

పేరుకు తగ్గట్టే ఆయన పబ్లిక్‌ స్పీచ్‌ చాలా కూల్‌గా ఉంటది. అది స్క్రిప్ట్‌ స్పీచ్‌ అసలే కాదు. చేసిన అభివృద్ది గురించి ఏకరువు పెట్టడమవ్వొచ్చు.. చేసే పనులు గురించి వివరించడం కావొచ్చు.. రాబోయే పథకాల సరళిని మనసుకు కట్టినట్టు జనాలకు రీచ్‌ అయ్యేలా తీసుకుపోవడం అవ్వొచ్చు… ఆ చెప్పే విధానం ఆకట్టుకుంటది. ఇదేదో స్కోత్కర్ష కాదు. జనాలను చూడగానే లీడరు కొంచెం ఆవేశపడతాడు. ఏదో చెప్పాలనుకుని ఏదో చెబుతాడు. మొత్తానికి అయిందనిపిస్తాడు. అవతలివాడి మీద ఎంత దుమ్మెత్తిపోస్తే.. ఎన్ని తిట్లు తిడితే.. ఎన్ని ఆరోపణలు చేస్తే… అంత బాగా ఆ కార్యక్రమం అయిందనుకుంటాడు. అలాగే అయిదనిపించేస్తాడు కూడా. కానీ ప్రశాంత్‌రెడ్డిది ఇందుకు పూర్తి భిన్నమనే చెప్పాలి.

కూల్‌గా మొదలై జనాన్ని నవ్వించే మాటలతో కొనసాగి… వారి సాదకబాధకాలు టచ్‌ చేస్తూ.. మనసులో మర్మాన్ని, ఏం కావాలో తర్జనభర్జన పడే మనస్తత్వాన్ని పసిగట్టి అదీ తనే చెప్పేసి…. అబ్బురపరుస్తాడు. దీంతో ఆయన మాటలకు కొంచెం కొంచెంగా అలా అలవాటు పడి లీనమై వింటూ పోతారంతే. పిన్‌డ్రాప్‌ సైలెంట్‌. నిశ్శబ్దంగా వింటూ ఉంటారు. మధ్యమధ్యలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడే మాటలకు తుళ్లిపడి నవ్వుతూ ఉంటారు. చిరుదరహాసం మహిళల మోములపై అలా ప్రత్యక్షమై చివరకంటా చిరుదీపంలా మిణుకుమిణుకుమంటు వెలుతరులీనుతూనే ఉంటుంది. ఒకరిమొఖాలొకరు చూసుకుంటారు. చూసి చూసి నవ్వుకుంటారు. ‘అవునే…కరెక్టే చెప్పిండు కదా..!’ అని ఒకరి కళ్లతో ఒకరు మాట్లాడేసుకుంటూ ఉంటారు నవ్వుకుంటూనే. ‘ దొడ్డు బియ్యం అమ్ముకుంటాం.. సన్నబియ్యానికి కొన్ని పైసలేసుకొని కొనుకుంటాం… కదా..!’ అని ఆయన అంటుంటే ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ‘ఎలా తెలిసిందబ్బా ఈయనకు.. చూసిండా ఏమీ..!’ అన్నట్టుగా అచ్చెరవొంది సిగ్గుపడతారు. నవ్వుతూ ఒప్పేసుకుంటారు. తమకు తెలియకుండా తలలాడించేస్తారు. అవును అన్నట్టుగా. ‘ అప్పటోళ్లకు తెలుసు తాగు నీటి కష్టాలు.. ఇప్పుడు ఇంటింటికి నల్లా పెట్టినం కొత్త కోడళ్లకు అప్పటి బాధలేమి తెలుసు..!’ అనగానే ఆడపడచులు తుళ్లితుళ్లిపడి ముసిముసి నవ్వులు కురిపిస్తారు. అమ్మలక్కల స్మృతిపథాలపై కొద్దిసేపు అలా అప్పటి రోజుల సినిమా రీలు ఆ మాటలతో తిరిగి వెళ్లిపోతూ ఉంటుంది. వారిని స్వగతంలోకి కొద్ది క్షణాలు తీసుకెళ్లి మళ్లీ ఇప్పటి కాలానికి తీసుకొస్తూ ఉంటుంది. చేతలే కాదు.. మాటలూ పనిచేస్తాయి. అవి ముచ్చటించినట్టుగా ఉంటే. అందులో నిజాయితీ ఇమిడి ఉంటే. నిబద్దత కలగలిసి ఉంటే. చేశాను.. చేస్తాను అనే ధీమా, నమ్మకం ఆ మాటల్లో ప్రస్పుటిల్లుతూ ఉంటే. అప్పుడే జనానికి ఆ నేత మరింత దగ్గరవుతాడు. దగ్గర మనిషిగా, తమలో మనిషిగా చూస్తారు. జనం నేతగా కీర్తిస్తారు. అలాంటి లీడర్లలో వేముల ప్రశాంత్‌ ఒకడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

– దండుగుల శ్రీనివాస్‌.. సీనియర్‌ జర్నలిస్టు

‘వాస్తవం’
(www.vastavam.in)

 

You missed