ఎట్టకేలకు ఉత్కంఠకు తెర వీడింది. పెండింగ్ లిస్టును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం లేదు. డైరెక్టుగా బీ ఫారాలిచ్చేసింది. వారికి నామినేషన్లు వేసుకోవాల్సిందిగా కూడా ఫోన్లు చేసి చెప్పేసింది. దీంతో అంతా రెడీ అయిపోయారు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిల పేర్లను అధిష్టానం ఓకే చేసేసింది. ఆరున రేవంత్ కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నాడు. కేసీఆర్ 9న నామినేషన్ వేస్తుండగా.. అదే రోజు షబ్బీర్ కూడా అర్బన్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నాడు. మొత్తానికి ఈ రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల చిక్కుముడిని విప్పింది అధిష్టానం. పోటీ మాత్రం రసవత్తరంగా మారనుంది.
ఇప్పటికే కేటీఆర్ కామారెడ్డి మీటింగులో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశాడు. రేవంత్ రా చూసుకుందాం అని కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో అక్కడ వార్ ఇద్దరి మధ్యే జరగనుంది. మరోవైపు షబ్బీర్ నాన్ లోకల్ అయినా… కాంగ్రెస్ శ్రేణులు మైనార్టీ మంత్రాన్ని జపించడంతో అసంతృప్తులంతా ఒక్కతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ ట్రై యాంగిల్ ఫైట్ రసవత్తరంగా మారనుంది.