రేషన్‌కార్డుల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. ఇందూరు జిల్లాలో ఇప్పటి వరకు లక్ష మంది తమ రేషన్‌కార్డుల్లో కొత్త పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జిల్లా యంత్రాంగం పెండింగ్‌లో పెట్టేసింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డుకు సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ఓపెన్ కాక నాలుగేళ్లయ్యింది. మలివిడత అధికారం చేపట్టిన తర్వాత వీటి జోలికి వెళ్లలేదు ప్రభుత్వం. కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుందామనుకుంటే అవి తీసుకునే వ్యవస్థే లేదు. మీసేవాలో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ పోర్టల్ ఓపెన్ లేదని వాపస్ పంపుతున్నారు.
అంటే ఎంత మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారో ఆ లెక్కలు కూడా ప్రస్తుతం జిల్లా యంత్రాంగం దగ్గర లేవు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ల్యామినేటెడ్ రేషన్‌కార్డులు లేవు. ప్రింట్ తీసుకుని వెళ్లాల్సిందే. మధ్యలో కొత్తగా రేషన్‌కార్డులు ముద్రణ చేద్దామనుకున్నా.. అది పెండింగ్‌లో పడింది. మళ్లీ గవర్నమెంట్‌లోనే ఇది జరగేటట్టుంది. మధ్యలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కొత్త రేషన్‌కార్డులకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అక్కడ బంద్ చేశారు. మరెక్కడా ఇది నాలుగేళ్లుగా ఓపెన్ కాలేదు. చాలా మంది దీని కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో ఇవే దరఖాస్తులు అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు లక్ష వరకు వచ్చిన దరఖాస్తులు డీఎస్‌వో ఆఫీసులో ఉన్నాయి.