ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ఎన్ని సార్లు అవగాహన కల్పించినా ఓటర్ల నుంచి అంతంత మాత్రమే స్పందన లభిస్తోంది. దీంతో బోగస్ ఓటర్లను ఏరి వేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఇప్పటి వరకు కొత్తగా ఓటర్ల నమోదుకు, సవరణలకు అవకాశం ఇచ్చినా పెద్దగా వీటిని ఉపయోగించుకోలేదు. పైపెచ్చు ప్రతిపక్ష పార్టీలో ప్రతీ నియోజకవర్గంలో వేలాదిగా బోగస్ ఓటర్లు వచ్చి పడ్డాయని వీటిని ఏరి వేయడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని మండిపడుతున్నాయి. మొన్నటికి కొత్త ఓటర్ల నమోదు, సవరణకు అవకాశం ముగిసినా.. చివరగా మరో ఛాన్స్ ఇచ్చారు. ఈనెల 19 వరకు దీన్ని పొడిగించారు. ఎట్టి పరిస్తితుల్లో ఈ తేదీ లోగా కొత్తగా అర్హులైన ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, అభ్యంతరాలు, ఆక్షేపణలకు అవకాశం ఇచ్చారు. ఇక ఇదే లాస్ట్ చాన్స్. ఆ తర్వాత అక్టోబర్ నెల 4న ప్రకటించే తుది ఓటరు జాబితానే ఫైనల్. ఇక దీన్ని మార్చేది లేదు. ఎవరెంత మొత్తుకున్నా ఇదే ఫైనల్ ఓటర్ లిస్టన్నమాట.
ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు,సవరణలు, తొలగింపులకు సంబంధించి చేపట్టిన స్పెషల్ డ్రైవ్, స్వీప్ కార్యకలాపాలకు మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తో కలిసి మాట్లాడుతూ గత జులై నుంచి ఈ నెల 5 వరకు చేపట్టిన విస్తృత ప్రచార కార్యక్రమాల వల్ల ఓటరు నమోదుకు 12,366, మార్పులు,చేర్పులకు సంబంధించి 3,160 దరఖాస్తులు , తొలగింపులకు సంబంధించి 752 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. వచ్చిన ధరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని, ఈ నెల 19 నాటికి ఓటరు నమోదు సంబంధించి పెండింగులో ఉన్న 10,814 ధరఖాసులతో పాటు పెండింగులో ఉన్న 3,558 ఇతర 7,8 ఫారాలను డిస్పోజ్ చేస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా బూత్ స్థాయిలో ఉన్న ఓటరు ముసాయిదాను జాబితాను పరిశీలించి ప్రముఖుల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు, వార్డు సభ్యులు తదితర పేర్లు జాబితాలో ఉన్నాయో లేవో పున :పరిశీలించుకుని, తొలగిపోతే ఫారం-6 ద్వారా నమోదు చేయించాలన్నారు. రాబోయే ఎన్నికలకు అక్టోబర్ 4 న ప్రకటించబోయే తుది ఓటర్ల జాబితానే ప్రామాణికమని, ఈ నెల 19 వరకు మాత్రమే ఓటరు నమోదుకు అవకాశమున్నందున ఓటరు నమోదు తో పాటు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియపరచాలన్నారు. ఓటర్ తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలున్నాయని, మరణ ధ్రువపత్రం పొంది, నోటీసు ఇచ్చిన పక్షం రోజుల తరువాతే తొలగింపు ఉంటుందని స్పష్టం చేశారు. స్వీప్ ద్వారా కళాశాల స్థాయిలో ఓటరుకు నమోదుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 1,2023 నాటికీ 18 సంవత్సరాలు నిండే యువ ఓటర్లు, ప్రధానంగా యువ మహిళా ఓటర్ల నమోదుకు చొరవ తీసుకుంటున్నామన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకటన తరువాతపోలింగ్ బూతులపై ప్రత్యేక దృష్టిపెట్టి రాంప్, వీల్ చైర్, మంచి నీటి సౌకర్యం, శౌచాలయాలు వంటి మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లు చూస్తామన్నారు. అదేవిధంగా వ్యయ నియంత్రణ, వీడియోగ్రఫీ,పోలింగ్ సిబ్బంది కి శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఏజెంట్ ల నియామకానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులను నియమించుకోవలసినదిగా సూచించారు.