మారుమూల ప్రాంతంలో.. దళిత కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని.. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఎదిగి అందరి ప్రశంసలు పొంది.. జుక్కల్‌ అభివృద్ధి ప్రధాతగా పేరొందిన హన్మంత్‌ షిండే….ఈ స్టేజీకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. అప్పటి ఆ కడుదుర్బరమైన రోజుల నుంచి ఈస్థాయికి రావడం వెనుక ఎంతటి కృషి దాగుందో.. మరెన్ని అవమనాలు, చీత్కారాలు, అవహేళనలు, ఆర్థిక కష్టాలు దాగున్నాయో.. అవన్నీ అందరికీ తెలియవు. కానీ మచ్చుకు ఒక ఉదాహరణ చెప్పాడాయనే.

ఇవాళ తన నియోజకవర్గంలో బీసీ చేతివృత్తుల వారికి లక్ష రూపాయల రుణాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన స్వగతాన్ని ప్రజలకు వివరించి తను కంటతడి పెట్టడమే కాదు.. ప్రజల హృదయాలనూ తడి చేశాడు. తన ఇంజినీరింగ్‌ జాయింగ్‌ కోసం కావాల్సిన 391 రూపాయలతో పాటు రానుపోను బస్సు చార్జీలు 22 రూపాయలు.. మొత్తం ఓ ఐదొందలు అవసరం ఉందని తండ్రికి లేఖ రాశాడు షిండే. ఇది ముప్పై తొమ్మిదేండ్ల కిందటి మాట. షిండే తండ్రి ఒకరి దగ్గర జీతం చేసేవాడు. తను హైదరాబాద్‌ నుంచి బిచ్కుందకు బస్సుకు వస్తున్నానని ఆ రోజు ఐదొందలు తీసుకుని రావాల్సిందిగా సూచించాడా లేఖలో. ఆ వేళ రానే వచ్చాడు.

కానీ బోరున వర్షాలు. వాగు పొంగిపొర్లుతున్నది. బస్సు దిగిన షిండే అక్కడ వాకబు చేశాడు. ఏమైంది మా నాన్న వచ్చాడా..? ఉహు.. రాలేదనే సమాధానమే వచ్చింది ఎవరి అడిగినా. ఏమి చేయాలో తెలియక ఏడుపు ముఖం పెట్టుకున్న షిండే.. వేచి చూసి చూసీ .. మిత్రుల వద్ద ఎలాగోలా డబ్బు సర్దుకొని ఇంజినీరింగ్‌ ఫీజు చెల్లించి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత బస్సు దిగగానే అక్కడున్న హోటల్‌ అతను షిండేతో అన్నాడట. ‘ బిడ్డా.. మీ నాన్న వచ్చిండు. ఐదొందలు తెచ్చిండు… కానీ అరగంట లేటుగా వచ్చాడు’ అన్నాడట. వాగు వచ్చింది కదా.. ఎలా వచ్చాడని అడిగితే.. ‘ ఎద్దు తోక పట్టుకుని వచ్చాడు బిడ్డా… అందుకే అద్దగంట లేటయ్యింది..’ అని చెప్పడంతో కన్నీటిపర్యంతమయ్యాడట షిండే. అవే మాటలు, అప్పటి యాది గుర్తు చేసుకుంటుంటే అతని గొంతు గద్గదమైంది. దుఃఖం తన్నుకువచ్చింది. తన వశం కాలేదు. బోరున ఏడ్చుడూ ఈ విషయాన్ని చెప్పుకున్నాడు అక్కడి ప్రజలతో. అప్పటి రోజుల్లో చదువుకు ఎంత కష్టమయ్యేదని వివరించాడు. చదువు ప్రాముఖ్యతనూ గుర్తు చేశాడు షిండే.

 

You missed