బోధన్‌లో షకీల్‌క్ మళ్లీ టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతామని ఆ పార్టీ సీనియర్ నేతే అధిష్టానానికి వివరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకరికొకరు ఫిర్యాదుల పర్వంతో బోధన్‌లో అధికార పార్టీ రాజకీయం వేడెక్కింది. బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి భర్త, సీనియర్ బీఆరెస్ లీడర్, కౌన్సిలర్ తూము శరత్‌రెడ్డికి ఎమ్మెల్యే షకీల్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. వీరిద్దరి మధ్య రోజు రోజుకు అంతరం పెరుగుతూ వస్తోంది. ఈ మధ్య షకీల్ ఎంఐఎం కౌన్సిలర్లను టార్గెట్ చేసి వారిపై మర్డర్ కేసు పెట్టించిన షకీల్.. ఇందులో తూము శరత్‌రెడ్డి పేరు కూడా పెట్టడంతో ఇద్దరి మధ్య తీవ్రమైన గ్యాప్ ఏర్పడింది.
ఇది ఎమ్మెల్సీ కవిత నోటీసుకు వెళ్లింది. మొన్న నిజామాబాద్‌లో ఆమె బోధన్ నియోజకవర్గంపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బోధన్ టౌన్‌లో ఇద్దరి మధ్య జరుగుతున్న వార్‌పైన కూడా చర్చ వచ్చింది. ఎమ్మెల్యే షకీల్ కవితను కలిసి తూము శరత్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. పిలిచి ఓ సారి మాట్లాడుతానని కవిత అన్నారు. కానీ శరత్ రెడ్డి కూడా పట్టుమీదే ఉన్నాడు. షకీల్ చేస్తున్న అక్రమాలు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు, పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తన గురించి అధిష్టానానికి నివేదించేందుకు రెడీగా ఉన్నారు. పనిలో పని అతనికి మళ్లీ టికెట్ ఇస్తే నిండా మునుగుతామని, తనకు ఇస్తే గెలిచి చూపిస్తామని కూడా కొత్త ప్రతిపాదన పెట్టనున్నట్టు తెలిసింది.
దీంతో ఇప్పుడు బోధన్ బీఆరెస్‌లో రెండు గ్రూపులు తయారయ్యాయి. షకీల్‌పై ఇటు ఎంఐఎంతో పాటు సొంత పార్టీ నేతలు కూడా కొంత కాలంగా గుర్రుగా ఉన్నారు. స్థానికంగా అందుబాటులో లేకపోవడం.. మాట్లాడిదే దుబాయ్‌కి వెళ్లిపోయి ఎవరికి అందుబాటులో లేకుండా పోవడంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. షకీల్ సోదరుడు సోహెల్ మున్సిపల్ వైస్ చైర్మన్ కావడంతో చైర్ పర్సన్‌కు పోటీగా చాంబర్ ఏర్పాటు, తనే పవర్ పాయింట్‌గా చలామణి కావడం తదితర ఇష్యూలు ఇద్దరి మధ్య అగ్నికి ఆజ్యం పోశాయి. శివాజీ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో కూడా షకీల్ అనవసరంగా రచ్చ చేసుకుని బజారుకెక్కాడు. దీంతో తూము శరత్‌రెడ్డి పేరు ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఒకప్పుడు షకీల్ గెలుపులో అన్ని విధాల అండగా ఉన్న శరత్.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. తనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా చెప్తున్నాడు.