లోయపల్లి పక్కచూపులు..

బీజేపీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ప్రయత్నం…

సొంత పార్టీలో ప్రాధాన్యత లేదనే అసంతృప్తి..

ఎమ్మెల్యేకు, నర్సింగ్‌రావుకు మధ్య కొరవడిన సఖ్యత…

వాస్తవం- కామారెడ్డి ప్రతినిధి:

మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు పక్క పార్టీ వైపు చూస్తున్నాడు. ఎమ్మెల్యే కావాలని ఎప్పటి నుంచో కోరిక. అది బీఆరెస్‌ పార్టీలో సాధ్యపడటం లేదు. మొన్న నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని భావించాడు. నామినేషన్‌ వేసే వరకు వెళ్లాడు. చివరి వరకు వచ్చే సరికి నర్సింగ్‌రావును తప్పించి కవితకు ఎమ్మెల్సీని ఇచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉండిపోయాడు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూర దూరంగానే ఉంటూ వస్తున్నాడు. దీనికికి తోడు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌తో కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నారు. ఇద్దరి మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది.

ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే.. నర్సింగ్‌రావును ఆహ్వానించలేదని, సమావేశం రోజున మొక్కుబడిగా రమ్మని ఫోన్‌ చేయడంతో తను రాలేదు. ఇది చర్చకు దారి తీసింది. బీఆరెస్‌ పార్టీ పెద్దలతో మంచి సంబంధాలు, బాంధవ్యాలు ఉన్న లోయపల్లి తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదని చాలా రోజులుగా అసంతృప్తి, అసహనంతో ఉన్నాడు. ఇక తనకు పార్టీలో ఎలాంటి పదవులు రావనేది తేలిపోయింది. దీంతో బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నాడు. దీని కోసం బీఆరెస్‌తో ఉన్న అనుబంధాన్ని, బాంధవ్యాలను కూడా తెంచుకునేందుకు సిద్దపడ్డాడు.

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మాచారెడ్డి మండలానికే పరిమితమైన తన రాజకీయాన్ని మెల్లగా నియోజకవర్గంలో పట్టుకోసం టైమ్ కేటాయిస్తున్నాడు. బీజేపీ పార్టీ పెద్దలతో సరైన సమయంలో సంప్రదింపులూ జరిపి .. బీఆరెస్‌కు ఝలక్‌ ఇచ్చేందుకు తెర వెనుక రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న లోయపల్లి ఎమ్మెల్యే కోసం ఈసారి గట్టిగానే ట్రై చేయాలని భావిస్తున్నాడు. దీని కోసంపార్టీ, సిద్దాంతం… బంధాలు అన్నింటినీ పక్కన పెట్టాలని డిసైడ్ అయిపోయాడు.

You missed