వర్సిటీ ఇజ్జత్ గంగలో…
భ్రష్టు పట్టించి… బద్నాం చేసి.. బట్టకాల్చి మీదేసి..
టీయూ వీసి వ్యవహార శైలి తీవ్ర వివాదస్పదం… అక్రమాలకు పాల్పడి.. లక్షల అవినీతి చేసింది తనే… తనకు ఎమ్మెల్యేలు, మంత్రి సహకరించలేదంటూ నెపం నెట్టే యత్నం..
వీసీప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న విద్యార్ధి సంఘాలు, టేబుల్ ఎక్కి నానా హంగామా.. ఉద్రిక్తత.. సర్వత్రా చర్చ.. ఇంకా ఇదెటు దారితీస్తుందో..?
ఆది నుంచి తెలంగాణ యూనివర్సిటీ వివాదాలమయవుతూ వస్తోంది. ఇక్కడ ఏ వీసీ వచ్చినా ఏదో ఒక లొల్లి.. ఏదో ఒక వివాదం. ఇప్పుడు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడింది. వీసీగా రవీందర్ గుప్తా వచ్చిన తర్వాత పూర్తిగా వర్సిటీ ఇజ్జత్ గంగలో కలిపేశాడు. అంతా నా ఇష్టం అంటూ నియమకాలు.. లంచాలు.. తనకు నచ్చినట్టు చేయడం.. పరిస్థితిని మరింత దారుణంగా తయారు చేసింది. మెడలు పట్టి బయటకు గెంటేసినంత పనిచేసినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా వీసి వ్యవహార శైలి నానాటికీ తీసికట్టుగా మారింది. ఏకంగా ప్రభుత్వాన్నే బద్నాం చేసే స్టేజ్‌కు వచ్చేశాడు. నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఎడా పెడా లక్షలు గుంజి నియమించుకుని, ఇప్పుడు వారిని తొలగించే పరిస్థితి వచ్చే సరికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని, మంత్రిని, ఎమ్మెల్యేలను కూడా వదలడం లేదు. వాళ్లు పట్టించుకోవడం లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నాడు. ఈ రోజు పెట్టిన ప్రెస్‌మీట్ రసాభాసగా మారింది. పలువురు విద్యార్థి సంఘాలు ప్రెస్‌మీట్ హాల్‌ను ముట్టడించారు. టేబుల్ పైకి ఎక్కి నానా హంగామా చేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా వర్సిటీ వ్యవహారం అంతా రచ్చ రచ్చగా మారుతోంది.
విలేకరుల సమావేశంలో విసి పై ఆందోళనకుదిగిన విద్యార్థి సంఘాల నాయకులు.
అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు విసీ విలేకరుల సమావేశాలకు చొరబడి పోడియం ముందుకు వచ్చి సమావేశ రౌండ్ టేబుల్ పైకి ఎక్కి విసీ డౌన్ డౌన్ అక్రమ విసి మాకొద్దు సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేస్తూ రౌండ్ టేబుల్ ని ధ్వంసం చేశారు. హుటాహుటిన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను బయటకు తీసుకెళ్లి ఆందోళన విరమింప చేశారు. వీసీపై వస్తున్న ఆరోపణ వరుస కథనాలపై కొందరు విలేఖరులు ప్రశ్నల వర్షం కురిపించగా, తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవస్థవాలని, నిజమేమిటో కోర్టు స్టే ఆర్డర్ ద్వారా తెలుస్తుందని నేను ఒక సైంటిస్టుని నాకు అవినీతికి పాల్పడే అవసరం ఏమిటని విలేకరులకు సమాధానం తెలిపారు.