నిజామాబాద్‌ పాత కలెక్టరేట్ ప్లేస్‌ వివాదమయం అయ్యింది. ఇక్కడ పాత కలెక్టరేట్ ప్లేస్‌లో కళా భారతి నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మధ్య విడుదల చేసిన వంద కోట్ల నిధుల్లో సగం దీనికే కేటాయించనున్నారు. దీనికంతటి ప్రయార్టీ సీఎం ఇస్తున్నారు. మొన్న జరిగిన రివ్యూలో ప్రధానంగా ఇదే అంశం చర్చకు వచ్చింది. యుద్ద ప్రాతిపదికన పాత కలెక్టరేట్‌ భవనాన్ని కూల్చేశారు. ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. ఇప్పటికే ఇక్కడ చిన్న క్రీడా మైదానం ఉంది. ఇది కూడా పోతే క్రీడాకారులకు ఆడుకునేందుకు సరైన జాగానే లేదనే అభిప్రాయం క్రీడాకారుల్లో ఉంది. ఇక్కడ మైదానం ఏర్పాటు చేయాలని, పార్కు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కొనసాగుతుండగా.. తెరపైకి ఓ కొత్త చర్చ వచ్చింది. పాత కలెక్టరేట్ ప్లేస్‌తో పాటు.. దానికి ఎదురుగా ఉన్న పాత ఎండీవో ఆఫీసు, డ్వాక్రా బజార్‌ ప్లేస్‌లలో దిల్‌ రాజు, యశోద ఆస్పత్రి వర్గాలు లీజులకు తీసుకుంటున్నాయని పుకార్లు లేచాయి. అదీ 99 సంవత్సరాల లీజు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి తోడు ఇవాళ సీపీఐ దీన్ని తెర మీదకు తెచ్చి.. కలెక్టర్‌కు బహిరంగ లేఖ రాసే వరకు వెళ్లింది. ఖాళీ జాగాల్లో అసలు ఏం నిర్మిస్తున్నారో చెప్పాలన్నారు. ఒకవేళప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తున్నారా..? అదీ వివరించాలన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయొద్దని, క్రీడావసరాలకు, పార్కు అవసరాలకు వాడుకోవచ్చని కోరుతున్నారు. ఇదిప్పుడు వివాదస్పదమయ్యింది.

ఇదీ సీపీఐ ప్రకటన….

పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏం నిర్మాణాలు చేపడుతున్నారో జిల్లా కలెక్టర్ గారు బహిరంగ ప్రకటన చేయాలని కోరుతూ సిపిఐ బహిరంగ లేఖ.
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తూ బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్ కు సమీపాన ఉన్న నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంగణం, ఎండిఓ కార్యాలయం, ఇతర ప్రభుత్వ శాఖల పాత భవనాలను కూల్చివేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ స్థలం పాత కలెక్టరేట్లో కళాభవన్ ను నిర్మిస్తామని స్వయానా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారే చెప్పడం జరిగింది. కానీ కళాభవన్కు కొద్ది స్థలం మాత్రమే కేటాయించి, మిగతా స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులైన సినీ నిర్మాత దిల్ రాజ్ గారికి, యశోద ప్రైవేట్ ఆస్పత్రికి 99 సంవత్సరాలు లీజు కు ఇచ్చేటటువంటి వార్తలు వినబడుతున్నాయి. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ఆలోచనను విరమించుకోవాలని ఇట్టి స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇస్తే జిల్లా,నగర ప్రజలు ఉద్యమిస్తారని తెలుపుతున్నామన్నారు.
పాత కలెక్టరేట్ గ్రౌండ్ను పార్క్ చేయాలి
ప్రస్తుతం ఉన్న పాత కలెక్టరేట్ గ్రౌండ్ను విద్యార్థులందరికీ నగరంలో అందుబాటులో ఉన్నదని ఈ గ్రౌండ్ను క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దాలని మరియు నగర ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఉదయం, సాయంత్రం కాలినడకకు అనువుగా పార్కును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో CPI జిల్లా నాయకులు ఓమయ్య, ఎండి.రఫీక్ ఖాన్, బాలయ్య పాల్గొన్నారు.

You missed