కమ్యూనిస్టు పార్టీలు అంటే అంతే. అవసరాల రీత్యా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో.. ఏ నిర్ణయాలు తీసుకోవాలో.. ఏ డిమాండ్లు చేయాలో … వారికే తెలియదు. అంతే .. అప్పటికప్పుడు తక్షణ అవసరాలు పార్టీ అవసరాలుగా మారతాయి. జనాలతో ఒక్కోసారి ఆ నిర్ణయాలతో సంబంధాలుండవు. తమ పార్టీ తమ ఇష్టం అన్నట్టుగా ఉంటుంది. బుర్జువా పార్టీలకు అవి కూడా ఏ మాత్రం తీసిపోవు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు టీఆరెస్‌కు జై కొట్టాయి. మద్దతు తెలిపాయి. అక్కడ బీజేపీని ఓడగొట్టాలి కాబట్టి టీఆరెస్తో జతకట్టామని చెబుతున్నాయి. మరి కాంగ్రెస్ కూడా లౌకిక పార్టీ కదా దానితో జత కట్టేది లేదా..? అంటే అది గెలిచేది కాదు.. చచ్చేది కాదు… అధికార పార్టీ వైపుంటే ఎంతో కొంత నాయకత్వానికి, పార్టీకి లాభం కదా..! అంతే .. లాభాలు బేరీజు వేసుకునే పనిలో కమ్యూనిస్టు పార్టీలు కూడా చేరాయి. ఇవి ఇప్పుడు కొత్త కాదు.. వింతా కాదు.
సరే, విషయానికి వద్దాం…
నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఈనెల 5న సీఎం కేసీఆర్ రానున్నారు. కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి అక్కడే బహిరంగ సభలో మాట్లాడతారు. బీజేపీ ఇప్పటికే ఇందూరు జనతా కో జవాబ్ దో కేసీఆర్ అనే పేరుతో ఓ లేఖ విడుదల చేసింది. తామేం తక్కువ తిన్నామా ..? అనుకున్నాయో .. ? లేకుంటే .. మునుగోడులో కేసీఆర్ దోస్తు అయినంత మాత్రానా ఆయన్ను ప్రశ్నలు అడగొద్దా..? నిలదీయొద్దా..? డిమాండ్లు కోరొద్దా..? అనుకున్నాయేమో.. సీపీఐ, సీసీఎం రెండూ పోటీలు పడి ప్రకటనలిచ్చాయి. ఏమని…. ఇగో ఈ కింద చూడండి…
రైతాంగం పండించిన పంటలకు MSP గ్యారెంటీ దారి నిర్ణయించి పార్లమెంటులో చట్టం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలి మరియు నిజామాబాద్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారికి వినతి నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ జిల్లా నాయకత్వం సోమవారం నాడు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహిరంగ లేఖను విడుదల చేశారు
కేంద్ర ప్రభుత్వం రైతాంగం పండించిన పంటలకు MSP గ్యారెంటీ ధర నిర్ణయించి పార్లమెంట్ లో చట్టం చేయాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని,2014 సంవత్సరం ఎన్నికల అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల వాగ్దానం లో భాగంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చి ఫ్యాక్టరీని ప్రారంభించి రైతాంగానికి కార్మికులకు న్యాయం చేయాలని, సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ కి ప్రభుత్వం 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని,తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్ల నిధులు కేటాయించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఇంటర్,డిగ్రీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి అందరిని పర్మినెంట్ చేయాలని ,బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరారు ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర్ భూమయ్య ,పి సుధాకర్, వై ఓమయ్య, ఏ రాజేశ్వర్, రఫిక్ ఖాన్, రఘురాం పాల్గొన్నారు
ఇట్లు
పి.సుధాకర్
సిపిఐ జిల్లా కార్యదర్శి నిజామాబాద్.
………………………………………………………………….
ఇది సీపీఐ ప్రకటన… సేమ్ సీపీఎం కూడా ఇంతే అదీ చూస్తారా… ఇగో
నిజాంబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు జరపాలి సిపిఎం డిమాండ్…
ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపటానికి తగిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని నిజామాబాద్ కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ని ప్రభుత్వపరం చేసి ఫ్యాక్టరీని నడిపి పూర్వపు స్థితికి తీసుకొస్తామని ఈ ప్రాంత ప్రజల రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు జరుగలేదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తగిన నిధులను కేటాయించి షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్మూర్ ప్రాంతంలో ప్రారంభిస్తామన్నారు లెదర్ ఫ్యాక్టరీ నిధులను కేటాయించి దాన్ని ప్రారంభించాలని ఆయన అన్నారు జిల్లాలో ప్రధాన రహదారుల పైన ప్రయాణికుల తాకిడి పెరగడంతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలు విస్తరించి నందున ముఖ్యమైన ఏర్పాటు చేస్తామన్న ఓవర్ బ్రిడ్జి లను మాధవ నగర్ ప్రాంతంలో బోధన్ ప్రధాన రహదారి పైన వెంటనే ఓవర్ బ్రిడ్జి లను నిర్మించాలని ఆయన అన్నారు. అదేవిధంగా జక్రాన్ పల్లి ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్న విమానాశ్రయానికి ఇంతవరకు పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. వీటితో పాటు ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు జిల్లాలో ప్రజలు ఎనిమిది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని నిర్మించిన వాటిని వెంటనే పంపిణీ చేసి మిగతా అర్హులకు ఇళ్ల స్థలాలను రుణాలను మంజూరు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఆసరా చేసుకుని బిజెపి జిల్లాలో బలపడాలని చూస్తున్నదని కానీ ఈ ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జిల్లా రైతాంగానికి ఇచ్చిన హామీ పసుపు బోర్డు మాట మరచి రైతులను మోసం చేశారని, జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కు రైల్వే డబుల్ లైన్ నిర్మాణం కొరకు తగిన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమ ప్రదర్శించకుండా ఇచ్చిన హామీలకు నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్ రాములు, సబ్బని లతా తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు,.
ఏ రమేష్ బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి
………………………………………………………………………………………………….
సరే, బాగానే ఉంది కానీ, కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు, ఆందోళనలు చేయడం మానేశాయా ఏందీ..? లేఖలు, ప్రకటనలు, ప్రెస్మీట్లు పెట్టి అలా సోషల్ మీడియాలో తోసేస్తే చాలు అనుకుంటున్నాయా..? అంతే అంతే వాళ్లు కూడా స్మార్ట్ వర్క్‌కు అలవాటు పడ్డారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు…. దీన్నీ తప్పుబడితే ఎట్లా బాసు..?