తెలంగాణలో పొలిటికల్ బ రస్ట్…
20 ఏళ్ల కిందటే క్లౌడ్ బరస్ట్…
ఇక మేఘాల విస్పోటనం తప్పదు… వాతావరణ నిపుణుల హెచ్చరిక…
క్లౌడ్ బ రస్ట్…. పొలిటికల్ బ రస్ట్…. ఇది వాస్తవం…

సరిగ్గా 22 ఏళ్ల క్రితం…. అంటే ఆగస్టు 2000లో వానలు ,వరదలతో రాజధాని హైదరాబాద్ నగరం అతలా కుతలమైంది. ఆకాశం బద్దలైందా…? మేఘాలు మొగులు పైనుంచి దిగి వచ్చాయా… అన్న భయంకరమైన రీతిలో నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఒక్క రాత్రి అంటే 12 గంటలలో 24 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆ క్రమంలోనే మొదటిసారిగా తెలంగాణలో క్లౌడ్ బ రస్ట్(మేఘాల విస్పోటనం) అనే పదం తెరపైకి వచ్చింది.
అప్పటివరకు క్లౌడ్ బరస్ట్ అనే పదం వాతావరణ నిపుణుల కే పరిమితమైంది. కానీ ఆ తర్వాత అది విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్ర‌కృతి పరంగా చోటు చేసుకుంటున్న అనూహ్యమైన వాతావరణ మార్పుల్లో క్లౌడ్ బ రస్ట్… కుండపోతలు… హీట్ వేవ్స్,. భరించరాని ఎండ దెబ్బలు తప్పవని ప్రపంచ పర్యావరణ నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు 20 ఏండ్ల కింద‌టి నుంచే హెచ్చరించారు.

అందులో భాగంగానే హైదరాబాద్ తో పాటు కేరళ, తమిళనాడు చెన్నై, ముంబాయి తదితర ప్రాంతాలు, ప్రధానంగా పట్టణ ప్రాంతాలు క్లౌడ్ బరస్ట్ తో తరచూ ముంపునకు గురవుతాయని రాయల్ మెట్రాలజీ కల్ సొసైటీ, ఇండో- జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ వంటి సంస్థలు ముందుగానే అంచనా వేశాయి. భూతాపం వల్ల ఇప్పటికే వాతావరణం గతి తప్పిందని, ప్రతి దశాబ్దానికి పరిస్థితి దిగజారి ప్రకృతి పరంగా విపరిణామాలు తలెత్తుతాయని హెచ్చరించాయి. రాబోయే 30 ఏళ్ల లో జరిగే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మేఘాల విస్ఫోటనం ఉంటుందనే విషయాలను పరిగణలోకి తీసుకొని పంట విధానాలను రూపొందించుకోవాలని నిపుణులు పదేపదే సూచిస్తున్నారు.
వాస్తవానికి క్లౌడ్ బరస్ట్ లు రెండు దశాబ్దాలుగా ప్రపంచంలోని చాలా దేశాల ను వనికిస్తున్నాయి. ఇందుకు హైదరాబాద్ కానీ తెలంగాణ పల్లె ప్రాంతాలు కానీ మినాహాయింపు కాదు. ఇక ముంబాయి చెన్నై, కేరళ తో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలలో మేఘాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒకే ప్రాంతంలో బద్దలు కావడం కుండలు ,బిందెలు డ్రమ్ములతో కుమ్మరించినట్టు మెరుపు వేగంతో వానలు కురిపించి అతలాకుతలం చేయడం సాధారణంగా మారుతుంది. ఆస్ట్రేలియా, అమెరికా , అమెజాన్ నుంచి ఆదిలాబాద్ మొదలుకొని ఎడారి ప్రాంతం దుబాయ్ లో కూడా క్లౌడ్ బరస్ట్ ను చవిచూడక తప్పలేదు.

నిజానికి రుతుపవనాలు బలపడడం తో పాటు వరుస అల్ప పీడనాలు తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. వాస్తవానికి జూలై నెలలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 241 మిల్లీమీటర్లు కాగా పదిహేను రోజులు గడిచేసరికి రెట్టింపు అంటే 531 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇది దశాబ్ద కాలంలో రికార్డు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరద కష్టాలు తప్పలేదు. ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కానీ దీనిని క్లౌడ్‌ బరస్ట్ గా నిర్ధారించలేమని నిపుణులు అంటున్నారు.
దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ పరిస్థితి కనిపిస్తున్నది. జ‌ల విల‌యం తాండ‌విస్తున్న‌ది. కేరళ తో పాటు ముంబాయి, ఉత్తరాది రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితి కొత్తేమీ కాదు. ప్రకృతిలో తలెత్తే ప్రతికూల పరిణామాలను పసిగట్టి అందుకు తగ్గట్టు ముందు జాగ్రత్తగా విధానపరమైన నిర్ణయాలను మార్చకపోవడం వల్ల భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. భవిష్యత్తు పరిణామాలను పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని, భారీ ప్రాజెక్టుల నిర్మాణం అంత మంచిది కాదని పర్యావరణవేత్తలు మొదటినుంచి హెచ్చరిస్తున్నారు. కానీ తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వాతావరణ మార్పులను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు.
ఫలితంగా ఒక్కసారిగా విడుచుకుపడుతున్న క్లౌడ్ బరస్ట్లను పాలకులు, ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణ శాఖ ముందుగా చేస్తున్న హెచ్చరికల వల్ల , అధికార యంత్రాంగం అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం చాలావరకు తప్పుతున్నది. గతంలో కంటే ప్రస్తుతం భారత వాతావరణ శాఖ అధికారులు వర్షాలు, తుఫాన్ లపై సరైన అంచనా వేయగలగడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతున్నది. ఇది ఒక శుభ పరిణామం. కానీ పంటనష్టం , ఆస్తి నష్టం అంచనా వేయలేనంత స్థాయిలో ఉంటుంది. ఇక ముందు ముందు కుండలు, బిందెలు, డ్రమ్ములతో గుమ్మరించినట్టు తరచూ క్లౌడ్ బరస్ట్ తప్పవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ కాస్త పొలిటికల్ బరస్ట్ గా మారింది.
కనివిని ఎరుగని రీతిలో కురిసిన వానలకు క్లౌడ్ బరస్ట్ కారణమని, దాని వెనుక విదేశీ కుట్ర ఉందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. క్లౌడ్ బరస్ట్ పై విదేశాలు కుట్ర చేయాలంటే దేశానికి మూడు వైపులా ఉన్న రాడార్ వ్యవస్థలను చేయించుకొని విమానాల ద్వారా రసాయన ప్రక్రియలను చేపట్టాలి. ఇది ఏ విధంగానూ సాధ్య‌మ‌య్యేది కాదు. మనదేశంలో నార్తర్న్ కమాండ్, వెస్ట్రన్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్ మూడు వైపులా రాడార్లను దాటుకుని ఎక్కడో ఒకచోట క్లౌడ్ బ‌ర‌స్ట్‌ ప్రయోగం చేయాల్సి ఉంటుంది. కానీ అది ఊహకందని విషయమని నిపుణులుతేల్చి పారేస్తున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో మేఘ మ‌థ‌నం జ‌రిగింది. వ‌ర్షాల‌ను కురిపించ‌డానికి క్లౌడ్ సీడింగ్ ప్ర‌యోగం జ‌రిపారు. కానీ క్లౌడ్ బ‌ర‌స్ట్ ప్ర‌యోగం ఎక్క‌డా జ‌రిగిన దాఖ‌లాలు లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇటువంటి ఆరోప‌ణ ఏ దేశం కూడా చేయ‌లేదు. ఎందుకంటే మేఘాల విస్పోటనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంది. దానికి ఏ దేశం, ఏ ప్రాంతం మినహాయింపు కాదు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అశాస్త్రీయంగా, అసంబద్ధంగా , అవివేకంగా మాట్లాడ‌డం ప‌ట్ల‌ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కాలేశ్వరం తో పాటు ఇతర ప్రాజెక్టుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం కుట్రపూరితంగా వింత వాదానికి తెర తీశారని ఆరోపిస్తున్నాయి. మొత్తానికి క్లౌడ్ బరస్ట్ తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ బరస్ట్ గా మారింది.

….. మ్యాడం మధుసూదన్, సీనియర్ పాత్రికేయులు.

You missed