తెలుగు సినిమాలన్నీ వరుసబెట్టి ఢాం… అని అట్టర్ ప్లాప్ అవుతున్న తరుణంలో … ఇదో ఊరట. ఎర్రటి ఎండలో చల్లని నవ్వుల వాన. లాజిక్కులకు అందని కథ. పాత రొడ్డుకొట్టుడు రొటీన్ స్టోరీ. కామెడీ సినిమాలన్నింటి నుంచి కంటెంటంత ఏరికూరి ఒక్కదగ్గర చేర్చి వండి వార్చిన సినిమా ఎఫ్3. తెలుగు సినిమాకు కథలే కాదు.. కామెడీ కరువవుతున్న తరుణంలో … హిట్టులు లేక తెలుగు ఇండస్ట్రీ ముఖం వాచిపోయి చూస్తున్న సందర్భంలో ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా వచ్చి కడుపుబ్బా నవ్వించింది. మొదటి ఎప్3కి ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్ కూడా ఇరగదీశాడు డైరెక్టర్. మొదటి సినిమా కథలో ఉన్నంత బలం ఈ సినిమాలో లేదు. అంతా అతుకుల బొంత.. రొటీన్ స్టోరీ.. ముందే చెప్పేయగల పాత చింతకాయ పచ్చడి కథే. కానీ ప్రతీ సీన్ నవ్వులు తెప్పించేదే. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎక్కడా నవ్వుల తుఫాను ఆగలేదు. ప్రతీక్షణం ఆ నవ్వుల జడివానలో ప్రేక్షక్షుడు తడిసి ముద్దయ్యాడు. చిరునవ్వులతో బయటకు నడిచాడు.
మొన్నామధ్య ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరి అడిగాడు డైరెక్టర్‌కు. జంధ్యాల, ఈవీవీ లేని లోటు మీరు తీరుస్తున్నారని అనిల్ రావిపూడిని. అంత సీన్ లేదు కానీ,,, కొంచెం ట్రై చేస్తున్నాడు. బెటర్. కామెడీని నమ్ముకున్నాడు. టైమింగును నమ్ముకున్నాడు. వెంకటేశ్‌లాంటి పరిపక్వత కలిగిన నటుడు ఇలాంటి సినిమాలకు ఒప్పుకోవడం కూడా డైరెక్టర్ సక్సెస్‌లో ఓ భాగమే. ఈ సినిమాలో వెంకటేశ్ కు రేచీకట్లు. అదీ సినిమాకు ఎంతో కలిసి వచ్చింది. కడుపుబ్బా నవ్వించింది.
ఏ హీరో ఇలాంటి పాత్రలు వేస్తాడు…? హీరోయిజం చట్రంలో ఇరుక్కుపోయి మూస కథల ఉచ్చులో ఉక్కిరిబిక్కిరయి… అభిమానుల పేరు చెప్పి ప్రయోగాలకు దూరంగా ఉండే ఓ చిరంజీవి.. ఓ నాగార్జున, పవన్ కళ్యాన్…. మహేశ్, జూనియర్, ప్రభాస్… ఎవరూ ఇలాంటి పాత్రలు ఒప్పుకోరు. ఈ విషయంలో వెంకటేశ్‌ను మెచ్చుకోవాలి. వయస్సు తగ్గ పాత్రలు. సందర్భోచితంగా నటన. అందరి మెప్పు పొందే మెచ్యూరిటీ పాత్రలు. ఇవే కదా కవాల్సింది మంచి సినిమాలు రావడానికి. ఇలా లేకనే తెలుగు సినిమాలన్నీ ఫల్టీ కొడుతున్నాయి. కుటుంబ సమేతంగా పిల్లా జెల్లతో కలిసి చూడొచ్చు. తెలుగు సినిమాలేవి పిల్లలుతో కలిసి చూసేవి ఎవడూ తీయడం లేదు. ఇది కాస్త బెటర్. ఎఫ్4 కూడా సీక్వెల్ తీస్తానన్నాడు డైరెక్టర్. మంచిదే. ఇలాంటి కామెడీ కథలు ఎన్ని సీక్వెల్స్ తీసినా ప్రేక్షకుడు ఆదరిస్తాడు. కడుపుబ్బా నవ్వించే పాత్రలను ఎప్పడూ ప్రేమిస్తాడు.
వరుస ఫ్లాప్‌లతో బిక్కముఖం వేసుకున్న తెలుగు ఇండస్ట్రీకి… మంచి కథలు లేక ముఖం వాచిపోయి ఉన్న తెలుగు ప్రేక్షకుడికి ఎఫ్3 ఓ చల్లటి నవ్వుల నజరానా..