ఈ మధ్య కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు సినీ నిర్మాతలు. బిత్తిరి సత్తి మాటలతో కడుపుబ్బా నవ్వించే ఇంటర్వ్యూలతోనే సగం హిట్టుగా భావిస్తున్నారు. సందర్బోచితంగా మాటలు కలిపి.. తన సృష్టించుకున్న భాషతో మాట్లాడే తీరు హీరోలను , డైరెక్టర్లను కూడా ఆకట్టుకుంటుంది. సినిమా రిలీజ్‌కు ముందే జనానికి చేరే విధంగా చర్చకు వచ్చే విధంగా ఇంటర్వ్యూలు యూ ట్యూబ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు సినిమాల్లో కామెడీ ఏమాత్రం లేకపోయినా… ఈ ఇంటర్వ్యూలతో వచ్చే కామెడీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి కూడా. ఆ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్లిపోతున్నాయో తెలియదు కానీ… ఈ ఇంటర్వ్యూ బిట్లు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కొత్త సినిమా వస్తే చాలు బిత్తిరి తో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. బిత్తిరి భాషకు ఫిదా అవుతున్నారు. ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ ఫట్ మని తేలిపోతున్నాయి. పట్టుమని పది రోజులు కూడా చక్కగా ఆడటం లేదు. కానీ బిత్తిరి ఇంటర్వ్యూలు మాత్రం హిట్ అవుతున్నాయి. కొత్త సినిమాలు వస్తే …. ముందుగా తారాగణంలో బిత్తిరి ఇంటర్వ్యూ కంపల్సరీగా కనిపిస్తుంది. బిత్తిరి సినీలోకంలో తనదైన ముద్రను వేసుకోవడమే కాదు.. స్థానాన్నీ పదిలం చేసుకుంటున్నాడు.