కేసీఆర్ తన అమ్ముల పొదిలో చాలా అస్త్రాలున్నాయన్నాడు. అవి ఒక్కొక్కటిగా బయటకు తీస్తే.. ఇక ప్రతిపక్షాలు నిలబడవని, కనబడవని కూడా ఓసారి అసెంబ్లీ వేదికగా ప్రకటించాడు. టీఆరెస్ ప్రభుత్వానికి ఆయువు పట్టే ఈ పథకాలు. రైతుబీమా, రైతుబంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నాయి. ప్రజల నాడి బాగా తెలిసిన కేసీఆర్ పథకాల రచనలో, వాటిని ఓట్లు మలుచుకోవడంలో సక్సెసవుతున్నాడు. ఇలా వేరే పార్టీలు చేయలేకపోతున్నాయి. వారిని ప్రజలు నమ్మలేదు కూడా. గతంలో ఎన్నికల్లో రెండు లక్షల రుణమాఫీ అని కాంగ్రెస్ ప్రకటించినా నమ్మలేదు. ఇక నిన్న జరిగిన వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీలు రైతు కేంద్రంగా అద్బుతంగా ఉన్నాయి.అవి బాగా రైతులకు కనెక్ట్ అయ్యేవి కూడా.
రెండు లక్షల రుణమాఫీ… ఈ హామీ ప్రతిపార్టీ ప్రతీసారి రైతులకు ఇస్తున్నదే. అమలే అంతంత మాత్రం.. అపనమ్మకంగా మారింది. ఇప్పుడు టీఆరెస్ కూడా ఇదే పంథాలో ఉంది. ఇంకా లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు. ఇక రైతుబంధు తరహాలో టీఆరెస్ పదివేలు ఏడాదికిస్తే… కాంగ్రెస్ పదిహేను వేలంటున్నది. అంతే కాదు.. కౌలు రైతులను టీఆరెస్ విస్మరించి వ్యతిరేకత ఎదుర్కొన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని వారికీ ఇది వర్తింపజేస్తామనడం బాగుంది. ఇది ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భూమి లేని ఉపాధి హామీరైతు కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామనడం కూడా బాగా కలిసివచ్చే అంశం. అందరూ మెచ్చుకోదగిందే. మాకు భూమి లేదు.. భూమున్న వారికే ప్రభుత్వం అన్నీ చేస్తుంది అని తీవ్ర నిరాశ, అసంతృప్తిలో ఉన్న పేద, కడు పేద వర్గాలను ఇది ఆకట్టుకుంటుంది.
అన్ని పంటలకు మద్దతు ధర కూడా మంచి అంశమే. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు, పసుపుబోర్డు ఏర్పాటు హామీ పాతచింతకాయ పచ్చడే. కానీ ఇవి చర్చలోకి వచ్చి.. ప్రజలను ఆకట్టుకునేవే. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయడం అనేది చాలా సార్లు డిమాండ్‌లో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ దీన్ని అమలు చేస్తాననడం కలిసివచ్చే అంశమే. ఇక పోడు భూములు, ధరణి రద్దు కూడా కొంత మేలు చేస్తుంది.
ఇవన్నీ ఇలా ఉంటే…. కేసీఆర్ ఇప్పుడు దీన్ని ఢీకొట్టేలా తన అమ్ముల పొదిలోంచి అస్త్రాలు తీయాల్సి ఉంది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాల మేనిఫెస్టో చూసి గత్తరబిత్తర చెందిన కేసీఆర్…. నిరుద్యోగులకు మూడు వేల భృతి లాంటి కొన్ని తనకిష్టం లేకపోయినా ప్రకటించాల్సి వచ్చింది. అలా ఇష్టం లేని పథకాలు ఇప్పటికీ అమలు లోకి రాలేదు. రానున్న ఎన్నికల్లో కూడా ఎవరికి తోచించి వారు ప్రకటించేసుకుని , ప్రజలను ఎంత ఎక్కువగా ప్రలోభ పెట్టి తమవైపు తిప్పుకోవాలనే దానిపైనే దృష్టిపెడతారమో. కానీ ఎవరి నమ్మాలి…? అనేదే ప్రధాన సమస్య. మేనిఫెస్టోలు ఎంత ఘనంగా ఉన్నా… ప్రజల ఎవరి పట్ల విశ్వాసం ప్రదర్కశిస్తారనేదే ప్రధాన సమస్య.