PRESS ఉండి తీరాల్సిందే*

PRESS అన్న అక్షరాలు తన వాహనంపై ప్రదర్శించిన నేరానికి, తన గుర్తింపు, అధీకృత పత్రాలు చూపినా పోలీసులు ఒక సీనియర్ జర్నలిస్టుకు రు.700 లు జరిమానాను విధించారని ఒక మిత్రుడు ‘సీనియర్ జర్నలిస్ట్స్’ గ్రూపులో ఒక పోస్ట్ పెట్టాడు. దీనిపై తక్షణం స్పందించాల్సిన జర్నలిస్టుల హక్కుల సంఘాలు కానీ, ప్రెస్ అకాడమీ వంటి సంక్షేమ వ్యవస్థలు కానీ స్పందించలేదు. అయితే వాటి తాలూకు నాయకులు, పెద్దలు దీనిని ఇంకా చూసి ఉండరనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులతో మంచి పరిచయాలున్న మరో మిత్రుడిని వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతూ నేను ఒక పోస్ట్ పెట్టాను. ఇక ఆ తరువాత….

రోగం ఎక్కడో చూడకుండా, తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయకుండా… సమస్య పక్కదారి పట్టింది. PRESS అన్న అక్షరాల ప్రదర్శన మన అహంకారానికి నిదర్శనమని, చట్టం ముందు అందరూ సమానులేనని, ఎక్కడయినా అధికారులు ఆపితే బుద్ధిగా క్యూలో నిలబడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు నిజాయితీగా జవాబు చెప్పి, అడిగిన పత్రాలు చూపి ముందుకు కదలాలనీ, లేని పక్షంలో అందరిలాగే జరిమానాలు చెల్లించాలని…ఇదే సమంజసమంటూ కొందరు వ్యాఖ్యానించగా… POLICE అన్న పదాన్ని వాళ్ళ వాహనాలపైనే తొలగిస్తున్నప్పుడు మనకెందుకు ఈ భేషజాలని… ఇలా కామెంట్లు వస్తున్నాయి. ఇదీ నిజమే అంటూ కొందరు లైకులు కొట్టేస్తున్నారు.

AMBULANCE, FIRE SERVICE ల లాగే PRESS, POLICE, DOCTOR, ON GOVT.DUTY … వంటివి ఉండి తీరాలి..ఎందుకంటే…

ఇవి అహాన్ని, స్టేటస్ ను, పరువు ప్రతిష్ఠలను ప్రదర్శించే అక్షరాలు కావు. చట్టాలను, నియమ నిబంధనలను తప్పించుకునే ఎత్తుగడలు కావు. ఇవన్నీ ప్రజాసేవలో ఆటంకాలు కలుగకుండా ప్రయాణం సాఫీగా సాగడానికి చేసుకున్న ఏర్పాటు.. అనధికారికమే అయినా ఆచరణలో తప్పనిసరి ఏర్పాటు. పైన పేర్కొన్న వర్గాల తాలూకు వాహనాలన్నీ ప్రజల మధ్య, ప్రజల సేవలో నిరంతరం తిరుగుతుండేవి. దాని తాలూకు వారంతా..నిత్యం ప్రజాసేవలో ఉండేవాళ్లు. వ్యక్తిగత పనులమీద తిరుగుతున్నా… అవసరం వచ్చినప్పుడు (ఇతర వర్గాల వారిలాగా కాకుండా) సొంత పనులు కూడా పక్కనబెట్టి రంగంలోకి అమాంతం దూకేవాళ్ళు. కాబట్టి వీరి వాహనాలపై ఆ అక్షరాలు ఉండి తీరాల్సిందే.

కేవలం పవర్ కారిడార్లలో స్వేచ్ఛగా తిరగడానికి మాత్రమే కాదు… ధర్నాలు, ఊరేగింపులు, అల్లర్లు, మతకల్లోలాలు, శాంతిభద్రతలు అకస్మాత్తుగా క్షీణించిన చోట, లాఠీచార్జీలు, ఫైరింగులు జరిగేచోట, ఆస్తులు ధ్వంసంచేస్తూ రౌడీ మూకలు రెచ్చిపోయే చోట, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగేచోట… PRESS, POLICE అనే బోర్డులు లేకుండా ముందుకు పోతే ఏమవుతుందో జర్నలిస్టులకుగానీ, పోలీసులకు గానీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సాధారణ ప్రజానీకాన్ని అనుమతించకుండా విధుల్లో ఉన్న పోలీసులు బారికేడ్లు, ముళ్ళ కంచెలుపెట్టి అడ్డుకున్నచోట్ల …కొన్ని సందర్భాల్లో అయితే పరిస్థితి శృతిమించిన చోట మైల్డ్ లాఠీచార్జీ (వీపులు, కాళ్ళు పగలకొడుతూ) చేసే చోట … PRESS, POLICE బోర్డులు లేకుండా ముందుకు వెళ్ళగలరా..అదీ క్షేమంగా పోగలరా… పోలీసులే.. పోలీసు వాహనాలని గుర్తించలేక, డ్యూటీలో సివిల్ డ్రస్సుల్లో ఉన్న ఇతర బ్రాంచ్ పోలీసులను, పై అధికారులను గుర్తించలేక చితకబాదిన సంఘటనలు ఎన్ని లేవు. బోర్డులు ఉంటేనే గతంలో పాతబస్తీవంటి ప్రాంతాల్లో ఎన్ని పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయో, ఎన్ని ప్రెస్ కెమెరాలు ధ్వంసమయ్యాయో ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పైన చెప్పిన బోర్డులు వారి వాహనాలపై ఉండాల్సిందే.

మజ్బూరీ కానామ్ మహాత్మాగాంధీ

చేతకానితనానకి ‘ముక్కుసూటి’, ‘స్ట్రిక్ట్’, ‘నిజాయితీ’ అన్న టైటిల్స్ తగిలించడం మనకు అలవాటే. పోలీస్, ప్రెస్, ఆర్మీ, డాక్టర్, లాయర్..ఇవన్నీ ఎంత ఎక్కువయిపోయాయంటే .. ట్రాఫిక్/క్రైం పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు తలకు మించిన భారమయిపోయాయి. వాటిని నియంత్రించలేక చేతులెత్తేసి చాలా కాలమయిన దశలో… ఇప్పడు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ .. హద్దు మీరిన ఈ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించలేక, అసలు అర్ధం చేసుకోలేక…. ముందు హెచ్చరికలు లేకుండా, అకస్మాత్తుగా ఆకాశంనుండి ఊడిపడి లాఠీ ఝళిపిస్తుంటే, జరిమానాలు విధిస్తుంటే…చక్రాల్లో కట్టెలు పెడుతుంటే…వాటి ప్రయోజనాలు, వాటి అవసరాన్ని కూడా మరిచి కనీసపు ఆలోచన చేయకుండా స్పందించడం మన కాళ్ళల్లో మనమే కట్టెలు పెట్టుకున్నట్లవుతుంది.

ఈ సమస్యను దయచేసి.. ‘‘ కార్ల బ్లాక్ ఫిలింను సినిమా హీరోల వాహనాలకే తొలగిస్తూ…’’ అంటూ సంబంధంలేని అంశాలతో ముడిపెట్టకండి.

ఒకటి మాత్రం నిజం. పోలీస్, ప్రెస్ బోర్డులు దుర్వినియోగమవుతున్నాయన్నది ఎవరూ కాదనలేని నిజం. ముందుగా PRESS సంగతి చూద్దాం. హైదరాబాద్ లో1974లో నేను జర్నలిజంలో ప్రవేశించినప్పటి నుండి(సైకిళ్ళ జమానా నుండి) స్వయంగా చూస్తూ చెబుతున్న విషయం… ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్సుల వాళ్లు, దాని అనుబంధ రంగాల వాళ్లు కూడా ఈ బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు…ప్రభుత్వ, ప్రైవేటురంగాలలోని ప్రజా సంబంధ విభాగాల వారు కూడా.. ఇప్పటికీ. వారి దాకా ఎందుకు… మన సంగతే చూసుకుందాం.. నైతికంగా కేవలం జర్నలిస్టులు మాత్రమే వాడాల్సిన ఈ బోర్డులను…. అన్ని రకాల మీడియా సంస్థల్లో వివిధ డిపార్టుమెంట్లలో పనిచేసే జర్నలిస్టేతర సిబ్బంది యావత్తూ .. సెక్యూరిటీ వారితో సహా వాడడం లేదా.. పత్రికలను ముద్రణ కేంద్రాలనుండి ఇతర ప్రదేశాలకు, ఊళ్లకు తరలించే వాహనాలు, న్యూస్ ప్రింట్ తరలించే భారీ వాహనాలు, ఇంకా చెప్పాలంటే… పొద్దుటిపూట న్యూస్ పేపర్లు ఇంటికి వేసే పేపర్ బాయ్స్ (నిజానికి వీరిలో చాలామంది మైనర్లు కూడా) వాడడం లేదా… ఇవన్నీ మనకు తెలియదా… మన చేతిలోని పనే అయినా ఏనాడన్నా వాటిని మనం నియంత్రించామా …. కనీసం ఆ ప్రయత్నమయినా చేసామా…

MLA, MP స్టిక్కర్లను వారి వాహనాలకే కాదు, వారి అనుచరుల వాహనాలకు కూడా యథేచ్ఛగా వాడడం వాస్తవం కాదా….

పోలీసు ఉన్నతాధికారులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ అకాడమీ వంటి సంక్షేమ వ్యవస్థలు తక్షణం స్పందించాలి. పోలీసు శాఖ, సమాచార శాఖ, రవాణా శాఖల్లోని ఉన్నతాధికారులు, అధికారపార్టీ పెద్దలు, రాజకీయ నాయకులు, అందరూ వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలి. AMBULANCE, FIRE SERVICE లలాగే PRESS, POLICE, DOCTOR, ON GOVT.DUTY అక్షరాలు ప్రదర్శించే బోర్డులు ఉండి తీరాలి(నంబర్ ప్లేట్లమీద కాదు). దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఏం చేయాలో తరువాత తీరిగ్గా ఆలోచించి పట్టిష్టమైన చర్యలు తీసుకోండి.

– ములుగు రాజేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్

You missed