ఒకరిది జాతీయ పార్టీ. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ. ఆర్మూర్ గడ్డ మీద నుంచి పోటీ చేయబోతున్నానని, అక్కడి స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50వేల మెజారిటీతో ఓడగొడతానని ప్రతిన బూనాడు. సవాల్ విసిరాడు.
మరొకరు స్థానిక ఎమ్మెల్యే. ఆర్మూర్ నుంచి పోటీ చెయ్.. నేను రెడీ.. నీకు డిపాజిట్ కూడా దక్కనివ్వను. ఇదే నా చాలెంజ్. అని సవాల్ విసిరాడు.
ఒకరేమో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఇంకొకరేమో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.
నిన్న నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఇస్సాపల్లి లో బీజేపీ నాయకులపై టీఆరెస్ లీడర్లు దాడి చేసిన ఘటనలో అర్వింద్ ఆగ్రహాంతో ఈ శపథం పూనాడు. పనిలో పని ఏం డౌట్ వచ్చిందో మళ్లీ తనే అన్నాడు. ముందు మీ కేసీఆర్ నీకు టికెట్ ఇచ్చేలా చూసుకో. నేను నీ సంగతి చూస్తా.. అని కూడా సవాల్‌లో కండిషన్ పెట్టాడు. అంటే. మళ్లీ నీకు టికెట్ వస్తుందా..? అసలు. అనేది అర్వింద్ డౌట్. ఈ డౌట్‌లో వాస్తవం ఉంది. ఎందుకంటే .. అసలే రెండో సారి సిట్టింగ్‌లకు టికెట్ ఇచ్చాడు కేసీఆర్. అదే గొప్ప. మధ్యంతర ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమైన కేసీఆర్.. సిట్టింగులకు కాకుండా వేరొకరి ఇస్తే అదో కొత్త గొడవ ఎందుకని రిస్క్ తీసుకోలేదు. అంతా తన భుజస్కంధాలపైనే వేసుకుని ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్‌తో గెలిపించుకున్నాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు.
సిట్టింగులు మళ్లీ గెలవడం కేసీఆర్ చలవే తప్ప… ఎమ్మెల్యేల గొప్పతనమేమీ లేదు. అది అందరికీ తెలిసిందే. అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు అలా చేయాల్సి వచ్చింది కేసీఆర్ కు. ఇప్పుడు మళ్లీ ముచ్చటగా మూడోసారి కూడా సిట్టింగులకు టికెట్ ఇస్తాడా..? అసంభవం. ఇప్పటికే చాలా మంది.. మెజారిటీగా ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా..? అని కసిగా ప్రజలు ఎదురుచూసే పరిస్థితులు కూడా చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. మరలాంటప్పుడు జీవన్ రెడ్డి ప్రతిసవాల్ కేవలం…. అర్వింద్ కు కౌంటర్ ఇవ్వడానికే తప్ప.. భవిష్యత్తులో టీఆరెస్ ఎమ్మెల్యేలకు మళ్లీ చాన్స్ వచ్చేది రానిది ఎవ్వరూ చెప్పలేరు.
ఇక అర్వింద్ కూడా తను నిజామాబాద్ జిల్లాను గంప గుత్తాగా తీసేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. బీజేపీ జాతీయ పార్టీ. ఈ పార్టీలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చేది అధిష్ఠానం. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. కానీ ఎంపీగా గెలిచిన తర్వాత అర్వింద్ మరీ సూపరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్లిపోయాడు. తనకు పైన పెద్దవాళ్లతో పరిచయాలున్నాయనే ఆలోచనో.. ఓవర్ కాన్ఫిడెంటో తెలియదు కానీ.. ఆర్మూర్ నుంచి తను పోటీ చేయబోతున్నట్టు ముందే ప్రకటించుకుని తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్న పేరు తెచ్చుకున్నాడు. జిల్లాలో తనేం అనుకుంటే అదే సాగుతుంది అనే భ్రమల్లో పార్టీ నేతలను ఉంచడంలో మాత్రం అర్వింద్ సక్సెసయ్యాడు.
ఎన్నికలైతే రానీ, మీరు ఎక్కడుంటారో.. ప్రజలు మిమ్మల్ని ఎక్కడుంచాలో డిసైడ్ చేస్తారు. మీ బలం ఎంతో.. ప్రజాబలం ఎంతో తేలిపోతుంది. జర తొందరెందుకు..? సవాళ్లు, ప్రతి సవాళ్లు , దాడులు మాని.. జర ప్రజావసరాల మీద దృష్టి పెట్టండి..