అసలు వైన్ షాపులో ఉద్దెర అడగడం.. వాడు ఇవ్వడమే ఓ వింత. ఇంట్లో తిండి గింజలు లేకున్నా.,. పప్పులు, నూనెలు ఖాళీ అయినా.. తిండి లేకున్నా సరే గానీ సాయంత్రం కాగానే తాగేందుకు మాత్రం మందు కావాలె. జేబుల చిల్లి గవ్వ లేకుంటే ఏందీ..? అడుక్కోనో.. అప్పు తెచ్చుకోనో ఏదో రకంగా వైన్ షాపు గడప తొక్కాల్సిందే. మందు గొంతులోకి ఒంపాల్సిందే. ఇండ్లకు వాస్తు సరిగ్గా ఉండకపోతే ఆ ఇంట్లో అంతా నష్టాలే అంటారు. కానీ వైన్ షాపులకు మాత్రం వాస్తు వర్తించదు. అది పూర్తి వాస్తు విరుద్దంగా ఉన్నా… నిత్యం కాసులు గలగలలాడాల్సిందే. లక్ష్మీదేవీ కళ కొట్టుచ్చినట్టు కనిపించాల్సిందే.
కానీ, ఈ వైన్ షాప్ యజమానికి ఏ వాస్తుదోషమే కాదు.. గ్రహదోశం.. నరదిష్టి… చేతబడి.. ఇంకా ఏవేవో ఆవహించాయనుకుంటాను. లేకపోతే, మందు ఉద్దెర ఇస్తాడా..? చెడబుట్టిండు .. మిగిలిన వైన్ షాపులోళ్ల ఇజ్జత్ తీసిండు. 8 లక్షల దాకా ఉద్దెర ఇచ్చిండంట. డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి టెండర్ కొత్తోడికి వచ్చింది. బాకీలు మాత్రం వసూలు కాలేదు. ఇగ లాభం లేదనుకొని పరువు తీస్తా బెటా.. ఫ్లెక్సీలకు మీ పేర్లెక్కిస్తా..అని బెదిరిస్తే గానీ దారికి రాలేదు ఈ మందుబాబులు. బాబ్బాబు.. నీకో దండం పెడతాం రా నాయన.. మా ఇజ్జత్ తీయకు..అని కాళ్ల బేరానికి వచ్చి బాకీ తీర్చేశారు.